బతుకు భారం..
సర్వం కోల్పోయాం…
కష్టార్జితం వరదపాలు
బురద నీటితో జీవనం
బుడమేరు ముంపు శాపం
బాధితుల ఆర్తనాదాలు
వరద తగ్గినా..తీరని వెతలు
న్యూస్ తెలుగు/అమరావతి: ‘మేం..రోజువారీ కూలీ చేసుకుంటేనే..ఆ రోజు గడుస్తుంది..పది రోజులుగా కూలి పనులు దూరమై…సర్వం ఆస్తులు కోల్పోయాం..ఇక మా బతుకులు బుగ్గిపాలే’ అంటూ వరద ముంపు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికాం..నిద్ర, ఆహారాలకూ దూరమయ్యాం..అక్కడక్కడా తమ వారిని పోగొట్టుకున్నాం’ అని సింగ్‌నగర్ పరిసర ప్రాంత వరద బాధితులు వాపోతున్నారు. ఇటీవల పడిన భారీ వర్షాలు, వరదలకు బుడమేరు వాగు పొంగి..విజయవాడ నగరంలోని మూడొంతల భాగాన్ని ముంచెత్తింది. ఈ ప్రభావం నగరంపైనా పడిరది. సింగ్‌నగర్ నుంచి నలుదిక్కులా రాకపోకలకు అంతరాయం కలిగింది. వరదల్లో రోజుల తరబడి చిక్కుకుని, ఇప్పుడిప్పుడే బాధితులు కోలుకుంటున్నారు. ఈ సమయంలో వరద తగ్గిందనుకుంటే..వారికి కష్టాలెదురవుతున్నాయి. ఇంటి మరమ్మతుల నుంచి వంట సామాగ్రి, గృహాపకరణ వస్తువులు, దుస్తులు..ఇలా ఒకటేమిటి..నిత్యం వినియోగించే అన్నీ వరదపాలయ్యాయి. ‘ప్రతిదీ ఇప్పుడు కొత్తగా కొనుగోలు చేయడం వారికి తలకుమించిన భారంగా మారింది..అసలు జీవనం సాగించడమే గనంగా మారిందని..వాంబేకాలనీకి చెందిన లక్ష్మీ వాపోయింది. సింగ్‌నగర్ పరిసర ప్రాంత గ్రామాలతోపాటు జక్కంపూడి కాలనీలకూ వరద నీరు చేరి సర్వం కోల్పోయామని బాధితుడు లక్ష్మయ్య గగ్గోలు పెడుతున్నాడు. వరద నీరు తగ్గినా..ఇళ్ల చుట్టూ,లోపల రెండు, మూడు అడగుల లోతు మురుగు మట్టెతో కాలనీలో దుర్వాసనగా ఉంటున్నాయి. దానికితోడు దోమల ఉధృతి పెరిగి అంటురోగాలు బాధితులకు వచ్చే ప్రమాదం పొంచి ఉంది. వరద తగ్గినప్పటి నుంచి ఇంటి పరిసరాలను, లోపల భాగాలను తీరిక లేకుండా బాధితులు శుభ్రం చేసుకుంటున్నారు. ఇళ్లు వదిలి బయటకు వెళ్లిన బాధితులు ఒక్కొక్కరూ తరిగి వస్తున్నారు. తమ ఇళ్ల దృశ్యాలను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కష్టపడి.ఇటుక ఇటుక పేర్చి నిర్మిచుకున్న చిన్నపాటి ఇళ్లు ధ్వంసమవ్వడం వారి నెత్తిన మరింత భారంపడినట్లుంది. ఎటు తిరిగొచ్చినా..నిలువ నీడ ఉండే చాలా ఇళ్లు పాక్షికంగాను, పూర్తిగాను ధ్వంసమవ్వడంతో వారికి దిక్కుతోచడం లేదు.
మురుగునీటితో జీవనం
మంచినీటి పైపులైన్లు, కుళాయిల ద్వారా మురుగు నీరు రావడంతో తాగునీరుకు నానా అవస్థలు పడుతున్నారు. ఆ నీటిని బాధితులు వాడుకోలేక పోతున్నారు. దీంతో ప్రభుత్వం సరఫరా చేస్తున్న ట్యాంకర్ల వద్దకు పరుగెడుతూ..బారులుతీరి నిలబడుతున్నారు. స్నానంచేసేందుకు బాత్‌రూమ్‌లకు వెళ్లినా అక్కడ మురుగునీరు రాకపోవడంతో బాధితులకు అసౌకర్యం ఎదురవుతోంది. ఇంట్లో ఇంకా కరెంట్ వచ్చే పరిస్థితి లేదు. నీటి మోటార్లు, పైపులైన్లు దెబ్బతిని మంచినీరు అందడం లేదు. నిత్యం ప్రజల కాలకృత్యాలకు ఇంకా అంతరాయ కలుగుతూనే ఉంది. పేరుకే ఇంట్లో ఉంటున్నారేగానీ, లోపల అంతా చెత్తా, బురద మయంగా మారాయి. వంట సామాగ్రిలోకి బురద పేరుకుపోవడంతో వాటిని శుభ్రం చేయడం తలకుమించిన భారంగా మారింది. గ్యాస్ స్టౌవ్‌లు పనిచేయకపోవడంతో బాధితులకు దిక్కుతోచడం లేదు. గ్యాస్ మెకానికల్‌ల కోసం క్యూ కడుతున్నారు. పిల్లలకు, వృద్ధులకు పాలు పెట్టి ఇచ్చేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ప్రభుత్వ సరఫరాచేస్తున్న ఆహార పొట్లాలను తీసుకుని ఇంట్లో ఆహారం తినే వాతావరణం లేక బయటకు వచ్చి తింటున్నారు. విద్యుత్ మీటర్లు నీటితో తడచిపోవడంతో వాటికి మరమ్మతులు చేయాలి. అప్పటికీ పనిచేయకుంటే కొత్తవి బిగించాలి.
వాహన యజమానుల వెతలు..
నిత్యం సింగ్‌నగర్ పరిసర ప్రాంతాల్లో వాహనాలు రద్దీగా కన్పించగా, వరదలతో పలచబడ్డాయి. వరదల నీటిలో వాహనాలు నానడంతో పనిచేయడంలేదు. మోటారు సైకిళ్లు, యాక్టివాలు, స్కూటీలు..ఇలా అన్నీ దెబ్బతిన్నాయి. కొన్ని వాహనాలు కొట్టుకుపోయి ఇంకా వాటి జాడ తెలియలేదు. వాహన యజమానులంతా వాటి కోసం వెతుకులాట ప్రారంభించారు. నెల, రెండు నెలల క్రితం కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలూ గల్లంతయ్యాయి. వేలాది ఆటోలు ముంపులోనే నానాయి. విలువైన కార్లు నీటిలో నాని, తడచిపోయాయి. ఈ వాహనాల మరమ్మతులకుగాను ఇన్సూరెన్స్ ఉన్న వారికి కాస్త వెసులుబాటు రాగా, ఇన్సూరెన్స్ లేకుంటే చేతులెత్తేయాల్సిందే. ఇన్సూరెన్స్ కంపెనీల సిబ్బంది కోసం వాహన బాధితులు చుట్టూ తిరగాల్సి వస్తోంది. వాహనాల మరమ్మతుల కోసం మెకానిక్‌ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఎక్కడ చూసినా మెకానికల్ షాపుల చుట్టూ వాహనాలు నిండిపోయాయి. వాటి రిపేర్లకు ఎంత ఖర్చవుతుందో..తెలియక బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో ఆటోలు నడవక, చేతిలో వాహనాలు లేక, బస్సులు పూర్తిగా రాకపోకలు సాగించక నానా అవస్థలు పడుతున్నారు. నిత్యం అవసరంగా ఉండే వాహనాలు అందుబాటులో లేకపోవడంతో పిల్లలను పాఠశాలలకు పంపడం కష్టంగా మారింది. ఆ ప్రాంతంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
పడక గదులు వరద నీటి మయం
ప్రతి ఇంట్లోను వంటగదితోపాటు పడక గదులూ వరద నీరుతో పూర్తిగా తడిచి కంపుకొడుతున్నాయి. బెడ్లపైకి బురద నీరు వచ్చి..వాటిని శుభ్రం చేయలేనంతగా అతుక్కుపోయింది. దిండ్లు రోజులతరబడి నీటిలో తడిచి నానిపోయాయి. ఇక చేసేదీమీలేక వాటిని బయట చెత్త వ్యాన్లలోకి పడేస్తున్నారు. బెడ్లు, మంచాలను ఆరుబయట ఎండబెట్టి..దయనీయం స్థితిలో ముంపు బాధితులున్నారు. ఈ వరదలతో కనీసం పేద కుటుంబానికి లక్షల రూపాయలు, మధ్యతరగతి వర్గాలకు ఐదు లక్ష్యల రూపాయలు, ఉన్నత వర్గాలకు పది లక్షల రూపాయల వరకూ ఆర్థికంగా నష్టం జరిగిందని బాధితులు చెబుతున్నారు. ప్రభుత్వం చేసిన నష్టగణనలోకి బాధితులకు జరిగిన నష్ట మొత్తాన్ని లెక్కించాలని కోరుతున్నారు. భారీ వర్షాలు, వరదల ప్రభావం ఏడు జిల్లాల్లో పడిరది. అందులో ఎన్టీఆర్‌జిల్లాపై అధికంగా పడగా, ఆ తర్వాత గుంటూరు, పల్నాడు, ఏలూరు జిల్లాల్లో అపార నష్టం జరిగింది. మిగిలిన జిల్లాల్లోనూ పాక్షికంగా నష్టం చేకూరింది. వ్యవసాయ, మత్స్య రంగానికి నష్టం జరిగింది. మత్స్యకారుల పడవులు, వలలు దెబ్బతిన్నాయి.అధికంగా విజయవాడ నగరాన్ని బుడమేరు ముంచెత్తడంతో ప్రజలు నిరాశ్రయిలయ్యారు. వరద ముంపునకు గురైన తమను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. (Story : బతుకు భారం..)