ప్రతి ఇంటిపైనా మువ్వన్నెల జెండా ఎగరాలి
ఊరూవాడా ర్యాలీలు నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్
గృహనిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశం
న్యూస్‌తెలుగు/విజయనగరం : ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా ఎగురవేసేలా ప్రజలను చైతన్య పరచాలని మండల, క్షేత్రస్థాయి సిబ్బందిని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. ఎంపిడిఓలు, ఇఓపిఆర్‌డిలు, హౌసింగ్ ఏఈలు, సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో కలెక్టరేట్ నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా, జాతీయ సమైక్యతను, దేశభక్తిని చాటిచెప్పే విధంగా, ప్రతీ ఇంటిపైనా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని ప్రభుత్వం ఆదేశించిందని, ఈ మేరకు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని కోరారు. గౌరవ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోరిక మేరకు, కాగితం లేదా గుడ్డతో తయారు చేసిన జెండాలను మాత్రమే ఎగురవేయాలని, ఎక్కడా ప్లాస్టిక్ జెండాలను వాడకూడదని స్పష్టం చేశారు. ఈ రోజు నుంచి రేపు సాయంత్రం వరకు జెండా ఎగిరేలా చూడాలన్నారు. అలాగే ప్రతిఊరిలోనూ జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించాలని, దీనిలో ప్రజాప్రతినిధులందరినీ భాగస్వామ్యం చేయాలని సూచించారు. అలాగే మండల కార్యాలయాల్లో సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేసి, ప్రజలు పెద్ద సంఖ్యలో సెల్ఫీలు దిగేటట్లు చూడాలన్నారు. ప్రత్యేక డిజైన్‌తో రూపొందించిన ఫెక్సీలు ఏర్పాటు చేసి, వాటిపై జైహింద్ లేదా హర్ ఘర్ తిరంగా రాయించి సంతకాలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాలన్నిటినీ ఫొటోలు తీయించి, హర్ ఘర్ తిరంగా యాప్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించేందుకు మేజర్ పంచాయితీకి రూ.25వేలు, పంచాయితీకి రూ.10వేలను ప్రభుత్వం మంజూరు చేసిందని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో గృహనిర్మాణాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుత ప్రగతిపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. జిల్లాలో 81,918 ఇళ్లు మంజూరు చేయగా, 38,671 ఇళ్లు ఇంకా వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. ఇంకా 11,191 ఇళ్లకు కనీసం పునాదుల కూడా వేయలేదని, వీటిని వెంటనే మొదలు పెట్టేందుకు చర్యలు తీసుకోవలని ఆదేశించారు. ప్రతిరోజు కనీసం 195 ఇళ్లు, వారానికి 1365 ఇళ్లు తప్పనిసరిగా స్టేజ్ అప్‌డేషన్ జరగాలని సూచించారు. కొన్నిచోట్ల ఇళ్ల నిర్మాణం జరుగుతున్నప్పటికీ, వాటిని అప్‌లోడ్ చేయడంలో తీవ్రమైన జాప్యం జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ఇళ్ల నిర్మాణ ప్రగతిని అప్‌లోడ్ చేయాల్సిన బాధ్యత ఇంజనీరింగ్ అసిస్టెంట్లదేనని స్పష్టం చేశారు. నిర్లక్ష్యాన్ని చూపే ఇంజనీరింగ్ అసిస్టెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ రోజునుంచే పని మొదలు పెట్టాలని, ఏరోజుకారోజు ప్రగతిని అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ నుంచి జెడ్‌పి సిఇఓ శ్రీదర్ రాజా, జిల్లా గృహనిర్మాణ శాఖాధికారి శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు. (Story : ప్రతి ఇంటిపైనా మువ్వన్నెల జెండా ఎగరాలి)