విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు పెట్టుకొని అంకిత భావంతో చదవాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు పెట్టుకొని అంకిత భావంతో చదవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. బుధవారం ఉదయం చిట్యాల వద్ద ఉన్న పి.జి కళాశాలలో నిర్వహిస్తున్న జె.ఎన్.టి.యు అనుబంధ ఇంజనీరింగ్ కళాశాలను, మర్రికుంటలోని కస్తూర్బాగాంధి బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. ఇంజనీరింగ్ కళాశాల తరగతి గదులు, లైబ్రరీ, ఇతర సౌకర్యాలు పరిశీలించారు. ఇంజనీరింగ్ కళాశాల తరగతి గదుల నిర్మాణ పనులు, వసతి గృహ టెండర్ ఆగిపోవడానికి గల కారణాలను కళాశాల ప్రిన్సిపాల్ ను అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని, జిల్లా యంత్రాంగం తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఇంటర్మీడియట్ ఎంపీసీ విద్యార్థులకు గణితం బోధించిన జిల్లా కలక్టర్
కస్తూర్బా గాంధి బాలికల విద్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడారు. వసతులు ఎలా ఉన్నాయి? ఉపాద్యాయులు సమయానికి వస్తున్నారా? భోజనం ఎలా ఉంటుంది మెనూ తెలుసా మీకు, గుడ్లు, మాసం ఎప్పుడెప్పుడు పెడతారు తదితర విషయాలను విద్యార్థుల వద్ద కూపి లాగారు. వసతులు బాగున్నాయి, భోజనం సైతం బాగుంది అని విద్యార్థులు సమాధానం చెప్పారు. అనంతరం ఇంటర్మీడియట్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు బోర్డు పై లెక్క వేసి పరిష్కరించాల్సిందిగా కోరారు. ఒక అమ్మాయి సమస్యను పరిష్కరించడం తో కలెక్టర్ అభినందించారు. నోట్ పుస్తకాలు బహుకరించారు.
అనంతరం కలెక్టర్ గణితంలో కొన్ని లెక్కలు సులువుగా ఎలా పరిష్కరించాలో బోధించారు.
అనంతరం ఆహార సరకులు వాటి నాణ్యతను పరిశీలించారు.
ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎన్.వి.ఎస్. రాజు, జి.సి. డి. ఈ. ఒ శుభలక్ష్మి, కస్తూర్బా గాంధీ ఎస్. ఒ. రోహిత, బి.సి.సంక్షేమ శాఖ అధికారి సుబ్బా రెడ్డి, అధ్యాపకులు తదితరులు కలక్టర్ వెంట ఉన్నారు. (Story : విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు పెట్టుకొని అంకిత భావంతో చదవాలి)