భగత్ సింగ్, చేగువేరా స్ఫూర్తితో పోరాడాలి
బిజ్జ శ్రీనివాసులు
న్యూస్‌తెలుగు/వనపర్తి : ప్రతి ఏఐవైఎఫ్ కార్యకర్త దేశం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్, చేగువేరా స్ఫూర్తి తో ప్రజల పక్షాన నిలిచి పోరాడాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బిజ్జ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. మంగళవారం వనపర్తి జిల్లా ఆఫీస్ లో జిల్లా నిర్మాణ సభలకు ముఖ్య అతిథిగా హాజరై పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ఎవరికి సమస్య వచ్చినా ఏఐవైఎఫ్ కార్యకర్త అండగా ఉంటాడని ధైర్యాన్ని ఇవ్వాలని, అప్పుడే ప్రజలు మన వెంట నడుస్తారన్నారు. న్యాయానికి అండగా, బాధితులకు తోడుగా నిలవాలన్నారు. స్థానిక సమస్యలను గుర్తించి పనిచేయాలన్నారు. బిజెపి యువతలో మతం విషం నింపి
పెడదారి పట్టిస్తోందన్నారు. దేశంలో అన్నదమ్ముల వలె కలిసి జీవించే హిందూ, ముస్లిం, క్రైస్తవుల మధ్యన మతం చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందుతోందన్నారు. దీన్ని ప్రజలు గుర్తించారని, పార్లమెంటులో 400 సీట్లు సాధిస్తామని బీరాలు పలికినా 240 సీట్లకే పరిమితం చేశారన్నారు. యువతలో చైతన్యం నింపాల్సిన బాధ్యత ప్రతి ఏఐఎస్ఎఫ్ కార్యకర్తపై ఉందన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నరేంద్ర మోడీ మోసం చేశారన్నారు. తనకు పిల్లలు లేరని చెబుతున్న ప్రధానికి, ఆదానీ అంబానీ తో సహా 36 మంది దత్తపుత్రులు ఉన్నారని దేశ సంపద వారికే దోచిపెడుతున్నారని విమర్శించారు. ఇందులో 32 మంది 15 వేల కోట్లు ప్రపంచ బ్యాంకుతో అప్పు తీసుకొని విదేశాలకు పారిపోతే వడ్డీతో సహా రూ.2025 కోట్లను నరేంద్ర మోడీ ప్రపంచ బ్యాంకుకు చెల్లించటమే ఇందుకు ఉదాహరణ అన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై పోరాడితేనే నాయకులుగా ఎదుగుతారని దీన్ని ఏఐవైఎఫ్ కార్యకర్తలు గుర్తించాలన్నారు. సాంఘిక దురాచారాలు, మూఢనమ్మ కాలం నుంచి ప్రజలను చైతన్యం చేయాలన్నారు. ఏ ఐ వై ఎఫ్ జిల్లా ఇన్చార్జ్ రమేష్ మాట్లాడుతూ.. వరకట్న హత్యలు, మహిళలపై దాడులు పెరుగుతున్నాయని యువత బాధితులకు అండగా నిలవాలన్నారు. ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. దేశంలో యువశక్తి అధికంగా ఉందన్నారు. శ్రీశ్రీ చెప్పినట్లు కొంతమంది యువకులు పుట్టుకతోనే వృద్ధులుగా జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువకులను చైతన్యం చేసి సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే దిశగా నడిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కె విజయరాములు, ఏఐవైఎఫ్ జిల్లా ఇన్చార్జ్ రమేష్, ఏఐటీయూసీ సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, జిల్లా అధ్యక్షులు యత్త మహేష్, ప్రధాన కార్యదర్శి ఎండి కుతుబ్, వంశీ తదితరులు పాల్గొన్నారు. (Story : భగత్ సింగ్, చేగువేరా స్ఫూర్తితో పోరాడాలి)