పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్ రంగరాజు
న్యూస్‌తెలుగు/విజయనగరం : నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రజా వినతుల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఉన్నత పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్ రంగరాజు, యూనియన్ ప్రధాన కార్యదర్శి జె. కామేష్ మాట్లాడుతూ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు మూడు సంవత్సరాల సరెండర్ లీవ్ తక్షణమే కార్మికుల ఖాతాల్లో జమ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులకు 62 సంవత్సరాలు కొనసాగించేలా చర్యలు చేపట్టాలన్నారు. కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులకు పదవీ విరమణ పొందిన సమయానికి 75 వేల రూపాయల గ్రాడ్యుటీతో పాటు, సంవత్సరానికి 2000 ఇస్తామన్న హామీ అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. చనిపోయిన కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులకు రెండు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా తో పాటు కుటుంబంలో ఉన్న ఒకరికి ఉద్యోగం కల్పించాలన్నారు. కార్మికులకు 2022లో జనవరి ,సెప్టెంబర్ ల యొక్క హెల్త్ అలవెన్సులు ఇవ్వాలన్నారు. సూపర్వైజర్లకు జీవో నెంబర్ ఏడు ప్రకారం 18,500 అమలు చేసినప్పటికీ అది ఇంతవరకు చెల్లించలేదన్నారు. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో పి రామకృష్ణ ,ఎం రాజు ,ఆర్ సారీ తదితర కార్మికులు పాల్గొన్నారు. (Story : పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలి)