సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవు
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
న్యూస్‌తెలుగు/విజయనగరం : సోషల్ మీడియాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా అనుచితమైన పోస్టులు పెట్టి, విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ హెచ్చరించారు. సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో వాస్తవాలను వక్రీకరిస్తూ మతాలను, కులాలను, పార్టీలను రెచ్చగొడుతూ వ్యక్తిత్వ హననంకు పాల్పడుతూ ట్విట్టరు, ఫేస్ బుక్, ఇనస్టాగ్రాం, యూట్యూబు, టెలిగ్రాం, వాట్సావ్, లింకిడిన్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ లో ఎవరికి తోచిన విధంగా వారు పోస్టులు పెట్టి మతాలు, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ, వ్యక్తిత్వ హననంకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై జిల్లా పోలీసుశాఖ ప్రత్యేకంగా నిఘా పెట్టిందన్నారు. ఇందుకుగాను ఒక పోలీసు బృందాన్ని ప్రత్యేకంగా నియమించి, సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారన్నారు. ఈ బృందం అందుబాటులో ఉన్న సాంకేతికతను వినియోగించుకొని, విద్వేషాలను రెచ్చగొట్టే ఉద్ధేశ్యంతో పోస్టులు పెట్టిన వ్యక్తుల వివరాలను రాబట్టి, వారికి నోటీసులు జారీ చేసి, వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు ఉపక్రమిస్తుందన్నారు. ఈ బృందం ఒక ఇన్స్పెక్టరు స్థాయి అధికారి పర్యవేక్షణలో ఒక సబ్ ఇన్స్పెక్టరు, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఆరుగురు పోలీసు సభ్యులతో పని చేస్తుందని తెలిపారు. కావున, ప్రజలు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్ అయిన ట్విట్టరు, యూట్యూబు, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, టెలిగ్రాం, లింకిడిన్ వంటి వాటిని వినియోగిస్తున్న సమయంలో విజ్ఞతతో వ్యవహరించాలన్నారు. తాము పోస్టు పెట్టేటపుడు ఇతరుల మతాలు, కులాలు, మనోభావాలకు, వ్యక్తిత్వానికి భంగం కలిగించకుండా ఉండాలన్నారు. పోస్టుల్లో వాస్తవాలను వక్రీకరించడం, వాస్తవాలు తెలుసుకోకుండా పోస్టులు చేయడం వలన ఇతరుల మనోభావాలు దెబ్బ తింటాయన్న వాస్తవాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాలన్నారు. సోషల్ మీడియాను పాజిటివ్ విషయాలను విస్తృతం చేసేందుకు, దూర ప్రాంతాల్లో ఉన్న మిత్రులు, బంధువులను దగ్గరి చేర్చే విధంగా వినియోగించుకోవాలని కోరారు. చాలామంది యువత సోషల్ మీడియాకు అలవాటు పడి, సోషల్ మీడియాలో చురుకుగా ఉండాలనే లక్ష్యంతో ఫేక్ అకౌంట్స్ ప్రారంభించి, అనుచిత పోస్టులు పెట్టి, చట్టాన్ని అతిక్రమిస్తున్నారన్నారు. అంతేకాకుండా,తమ విలువైన సమయాన్ని వృదా చేసుకొంటూ, లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమవుతున్నారన్నారు. యువత, ప్రజలు సోషల్ మీడియాను పాజిటివ్ కోణంలో వినియోగించుకొని, సాంకేతికతను అందిపుచ్చుకొని, నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరుకోవాలన్నారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉన్నామని ఇతరులచే గుర్తింపు పొందేందుకు విద్వేషాలు రెచ్చగొడుతూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపైనా, వారిని ప్రోత్సహించే వారిపైనా చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. (Story : సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవు)