నాలుగో డివిజన్లో కమిషనర్ ఎంఎం నాయుడు పర్యటన
న్యూస్‌తెలుగు/విజయనగరం : నగరంలోని 4వ డివిజన్ పూల్ బాగ్ ప్రాంతంలో జరిగిన వార్డు పర్యటన కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎంఎం నాయుడు, స్థానిక కార్పొరేటర్ మారోజు శ్రీనివాసరావు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డివిజన్ లో వివిధ ప్రాంతాలలో పర్యటించిన కమిషనర్ స్థానిక సమస్యలపై ఆరా తీశారు. ఆ ప్రాంతంలో ప్రధాన గెడ్డవాగు పూడికితీత పనులను ఆసాంతం పరిశీలించారు. దాదాపు 35 సంవత్సరాలుగా పూడికను తొలగించకుండా నిరుపయోగంగా ఉన్న వాగునకు జెసిబిల సహాయంతో భారీ ఎత్తున పూడిక తీత పనులు చేపట్టారు. ఈ ప్రక్రియలో ప్రత్యేక శ్రద్ధ కనపరచిన పారిశుద్ధ్య పర్యవేక్షకుడు రామకృష్ణను కమిషనర్ అభినందించారు. నిరుపయోగంగా ఖాళీ స్థలాల్లో చెత్తాచెదారాలు పెరిగిపోవడానికి చూసి సంబంధిత కార్యదర్శులను పై మండిపడ్డారు. అనంతరం అంగన్వాడీ కేంద్రానికి చేరుకొని అక్కడ పిల్లలకు అందుతున్న విద్య, నైపుణ్య శిక్షణ పరిశీలించారు. అయితే పిల్లల్లో ఆశించినంత విద్యా ప్రమాణాలు మెరుగు పడలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో కమిషనర్ ఎంఎం నాయుడు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి గురువారం వార్డు పర్యటన చేపడుతున్నామన్నారు. అందులో భాగంగా 4వ డివిజన్లో వార్డు పర్యటన చేపట్టమన్నారు. స్థానిక సమస్యలను తెలుసుకొని వెనువెంటనే పరిష్కరించే దిశగా వార్డు పర్యటనలు దోహదపడతాయని అన్నారు. 35 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న గెడ్డ ప్రాంతాన్ని యుద్ద ప్రాతిపదికన పూడిక తీత పనులు చేపట్టడం అభినందనీయమన్నారు. డివిజన్ కార్పొరేటర్ మారోజు శ్రీనివాసరావు మాట్లాడుతూ తాము కోరిన వెంటనే గెడ్డ లో పూడికతీత ప్రక్రియనూ అధికారులు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి ప్రజలకు మెరుగైన పాలన అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి, వివిధ విభాగాల అధికారులు, పారిశుద్ధ్య పర్యవేక్షకులు పాల్గొన్నారు. (Story : నాలుగో డివిజన్లో కమిషనర్ ఎంఎం నాయుడు పర్యటన)