ఇసుక ఉచితంగా ఇస్తున్నాం
గత నాలుగేళ్లలో అక్రమ తవ్వకాలు యథేచ్చగా జరిగాయి
కలెక్టర్ల సదస్సులో గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా
న్యూస్‌తెలుగు/ అమరావతి: రాష్ట్రంలో ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తోందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లకు సూచించారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన గనుల శాఖ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. ఇసుక తవ్వకాలు అనేది ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారిందన్నారు. ఉచిత ఇసుక విధాన నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ప్రభుత్వం ప్రజలకు ఇసుకను పూర్తీ ఉచితంగా ఇస్తోందని చెప్పారు. దీనిపట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇసుక రవాణ కోసం కొంత అధనపు ఖర్చు అవుతున్నప్పటికీ అది నామమాత్రమేనని చెప్పారు. ప్రజలకు ఎక్కడా కూడా ఇసుక కొరత లేకుండా ఇసుక లభ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక స్టాక్ యార్డుల్లో దాదాపు 33 లక్షల టన్నుల ఇసుక లభ్యత ఉందని చెప్పారు. ఇసుక కోసం వస్తున్నవారు నిజంగా ఇసుక అవసరమున్నవారా లేదా అనే విషయాలు పరిశీలించాలన్నారు.
గత నాలుగేళ్లలో అక్రమ తవ్వకాలు యథేచ్చగా సాగాయి
గత నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్చగా సాగాయని ముఖేష్‌కుమార్ మీనా అన్నారు. చివరకు ఈ అక్రమ తవ్వకాల విషయంలో సుప్రీం కోర్టు కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చిందన్నారు. సుప్రీం కోర్టుకు కూడా తప్పుడు నివేదికలు ఇచ్చారని అలాంటి అధికారులపైన చర్యలు తీసుకుంటున్నామని, ఇటీవలే ఒక అధికారిని సస్పెండ్ చేశామని చెప్పారు. కలెక్టర్లు కూడా అక్రమ ఇసుక తవ్వకాలు, గనుల అక్రమ తవ్వకాలపైన దృష్టి సారించి అక్రమ తవ్వకాలు, రవాణ అరికట్టడానికి కఠినంగా వ్యవహరించాలన్నారు. ఏఏ ప్రాంతాల్లో ఖనిజాల అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయనేది గుర్తించామని, దాని ప్రకారం సత్వర చర్యలకుపక్రమించాలని ముఖేష్ కుమార్ మీనా అధికారులకు సూచించారు.