ధరల నియంత్రణకు జిల్లాలో ప్రత్యేకాధికారి
దేశంలో తక్కువ ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రంగా ఏపీ ఉండాలి
త్వరలో చౌక దుకాణాల్లో ఖాళీల భర్తీ
పౌరసరఫరాల శాఖ కమీషనర్ సిద్ధార్థ్ జైన్
న్యూస్‌తెలుగు/అమరావతి: రాష్ట్రంలో ధరల నియంత్రణ కోసం జిల్లాల్లో ప్రత్యేక అధికారిని (డెడికేటెడ్ ఆఫీసర్) ఏర్పాటు చేసి ఆయా జిల్లాల్లో నిత్యావసరాల ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమీషనర్ సిద్ధార్థ్ జైన్ చెప్పారు. కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ దేశంలోనే అతి తక్కువ ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రంగా ఏపీని నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో నిత్యావసరాల ధరలపైన నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నామని తెలిపారు. జిల్లాల్లో క్షేత్రస్థాయిలో ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ధరలను నియంత్రణలో పెట్టడం కోసం ప్రత్యేకించి ఒక అధికారిని ఏర్పాటు చేస్తున్నామని దీనికి జిల్లా కలెక్టర్ల సహకారం అవసరమన్నారు. పౌరసరఫరాల శాఖ ఇన్ఫార్మ్, రిఫార్మ్, పెర్పార్మ్ విధానంలో ముందుకెళుతున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా కందిపప్పు ధర పెరిగినప్పటికీ రాష్ట్రంలో రైతు బజార్ల ద్వారా ప్రజలకు సరసమైన ధరలకే కందిపప్పు అందేలా చూడగలిగామని, కేజీ కందిపప్పు ధర రైతు బజార్లలో రూ.150కి లభించేలా చర్యలు తీసుకొచ్చామన్నారు. పేదవారికి అందించే నిత్యావసరాల కోసం ప్రభుత్వం నెలకు రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తోందని ఇందులో అక్రమాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. బియ్యం అక్రమ రవాణ కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. గత ఐదు సంవత్సరాల కాలంలో పౌరసరఫరాల శాఖలో పలు లోపాలు నెలకొన్నాయని వాటిని ఇప్పుడు సంస్కరిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 6 వేల చౌక దుకాణాల్లో త్వరలోనే ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. చౌక దుకాణాల్లో స్టాకు లేదు అనే మాట వినపడకుండా ప్రతి నెలా చౌకదుకాణంలో తప్పనిసరిగా స్టాకు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ధాన్యం సేకరణ కూడా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, దీనికి క్షేత్రస్థాయిలో కలెక్టర్ల సహకారం అవసరమన్నారు. ధాన్యం సేకరణలో పంట పండించిన కౌలు రైతులకే వారి పంట సొమ్ము దక్కేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. (Story : ధరల నియంత్రణకు జిల్లాలో ప్రత్యేకాధికారి)