ఏ మున్సిపాల్టీలోనూ చెత్త కనపడటానికి వీల్లేదు
అన్నా క్యాంటీన్లు స్వయం సమృద్ధి సాధించేలా చూడండి
టీటీడీ నిత్యాన్నదానం తరహాలో ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేద్దాం
కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
న్యూస్‌తెలుగు/ అమరావతి: రాష్ట్రంలో ఏ మున్సిపాల్టీలో కూడా చెత్త కనపడటానికి వీల్లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన
మాట్లాడుతూ పట్టణాలు, గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంటువ్యాధుల పట్ల శ్రద్ద కనబరచాలన్నారు. క్రమం తప్పకుండా నీటి పరీక్షలు నిర్వహించడంతో పాటు దోమల బెడద నివారించడానికి డ్రోన్ సహకారం తీసుకోవాలని సూచించాలి. రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు స్వయం సమృద్ధితో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులు ఇచ్చిన విరాళాలతో రూ.వెయ్యి కోట్ల కార్పస్ ఫండ్స్ ఏర్పాటు చేసి టీటీడీ నిత్యాన్నదానం కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. అలాగే అన్నా క్యాంటీన్లు కూడా దాతల నుంచి విరాళాలు సేకరించి స్వయం సమృద్ది సాధించి నిర్వహణ జరిగేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. దాతలకు స్ఫూర్తి కలిగించేలా ఈ కార్యక్రమాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లితే బాగుంటుందో వినూత్న ఆలోచనలతో అధికారులు ముందుకు రావాలని కోరారు.
స్వచ్ఛ భారత్ యూసీ సర్టిఫికెట్లు ఇవ్వండి
స్వచ్ఛ భారత్ నిర్వహణలో ఒకప్పుడు మనం ముందున్నామని గత ఐదేళ్లలో ఈ పథకం కింద రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయో కూడా తెలీని పరిస్థితి నెలకొందన్నారు. ఢిల్లీకి వెళితే కేంద్రం చేసే ప్రధాన ఫిర్యాదు ఏంటంటే స్వచ్ఛ భారత్‌కు మేం ఇచ్చిన డబ్బులకు ఇప్పటి వరకు యుటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు అంటున్నారని, జిల్లా కలెక్టర్లు వెంటనే ఈ యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇచ్చేలా తమ తమ జిల్లాలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెత్త నుంచి సంపద సృష్టించవచ్చని తాను ఏనాడో చెప్పానని, ఇప్పుడు ఎన్నో ప్రైవేటు సంస్థలు చెత్తను విద్యుత్తుగా మార్చి మనకు డబ్బులు చెల్లించడానికి ముందుకొస్తున్నాయని దాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. అన్ని మున్సిపాల్టీల్లో చెత్త సేకరించి, దాని నుంచి విద్యుత్తు తయారీ దిశగా అడుగులు వేయాలన్నారు. దీనికోసం గతంలో తాము ప్రవేశపెట్టిన పద్ధతులను పునరుద్ధరించాలని సూచించారు.
అమరావతిలో పీపీపీ విభాగం
రహదారుల నిర్వహణ పీపీపీ విధానంలో ప్రవేటు సంస్థలకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. దీనివల్ల ఆ రహదారిని వారు సమర్థవంతంగా నిర్వహించడమే కాకుండా రోడ్డు మీద గుంతలు పడినా ఎప్పటికప్పుడు ఆ గుంతలను పూడ్చి మరమ్మతులు చేస్తారన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్‌కు ఆకాశమే హద్దు అన్నారు. అమరావతిలో ప్రత్యేకించి ఒక పీపీపీ విభాగం ఏర్పాటు చేస్తున్నామని, జిల్లాల్లో పీపీపీ మోడల్ లో ఏదైనా పని చేయాలంటే ఈ విభాగాన్ని సంప్రదించి వారి నుంచి సలహాలు సూచనలు కూడా పొందవచ్చని తెలిపారు. పేదలకు రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని ఎన్నికల్లో మాటిచ్చామని ఆ దిశగా ఈ ఆరోగ్య బీమా నిర్వహణ దేశంలోనే అత్యంత బెస్ట్ మోడల్ గా ఉండాలన్నారు. నాడు తాము వైద్య రంగంలో పీపీపీ మోడల్ లో చేపట్టిన చర్యలోభాగంగా మెడ్ టెక్ ఏర్పాటు చేస్తే అది ఇప్పుడు దేశంలోనే నెంబర్ వన్‌గా ఉందన్నారు. అధికారులందరూ వినూత్న ఆలోచనలతో పనిచేయాలని సంక్షోభం అనేది ఒక అవకాశమన్నారు.(ఏ మున్సిపాల్టీలోనూ చెత్త కనపడటానికి వీల్లేదు)