మీ క్రమ శిక్షణ, అంకిత భావమే ఉద్యోగులకు స్పూర్తిదాయకం
ఆత్మీయ వీడ్కోలు సభలో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
న్యూస్‌తెలుగు/ విజయనగరం : సుదీర్ఘకాలం పోలీసుశాఖలో బాధ్యతాయుతంగా ఎంతో క్రమ శిక్షణతో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన (1) దిశ పోలీసు స్టేషను డిఎస్పీ టేకి మోహనరావు (2) బొబ్బిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ సేపాన తిరుమలరావు (3) విజయనగరం రూరల్ హెడ్ కానిస్టేబులు పాండ్రంకి వాసుదేవరావు లకు జిల్లా పోలీసుశాఖ తరుపున జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ – పోలీసుశాఖకు మంచి సేవలందించి నేడు ఉద్యోగ విరమణ చేస్తున్న డిఎస్పీ టేకి మోహనరావు, సిఐ తిరుమలరావు, హెచ్సీ వాసుదేవరావులకు శుభాకాంక్షలు తెలిపారు. పోలీసు విధులను నిర్వహించడంలో క్రమ శిక్షణ, అంకిత భావంతో పని చేసి, ఇతర పోలీసు ఉద్యోగులకు సూర్తిదాయకంగా నిలిచారన్నారు. పోలీసు ఉద్యోగంలో ప్రతీ రోజూ ఒక కొత్త రకమైన సవాలు ఎదురవుతునే ఉంటుందని, వాటిని సమయస్ఫూర్తితో ఎదుర్కొని, సవాళ్ళును అధిగమించాల్సి ఉంటుందన్నారు. గతంలో జిల్లాలో మావోయిస్టుల ప్రభావం తీవ్రంగా ఉండేదని, జిల్లాలో పని చేసిన అధికారులు, సిబ్బంది సమర్ధవంతంగా పని చేయడం వలన నేడు జిల్లాలో మావోయిస్టుల ప్రభావం కనుమరుగైందన్నారు. మావోయిస్టు కార్యకలాపాలను నియంత్రించుటలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు దేశంలోనే ప్రధమ స్థానంలో ఉన్నారన్నారు. ఉద్యోగ విరమణ చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది వారి విధులను సక్రమంగా నిర్వహించడంలోను, వారి పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దడంలోను వారి భాగస్వామ్యుల పాత్ర ఎనలేనిదన్నారు. ఉద్యోగ విరమణ తరువాత పోలీసు ఉద్యోగులు తమ సమయాన్ని తమ ఆరోగ్యంపైనా, కుటుంబ సభ్యులతో గడిపేందుకు వెచ్చించాలని జిల్లా ఎస్పీకోరారు. ఉద్యోగ విరమణ చేస్తున్న పోలీసు అధికారులు తమ సర్వీసులో ఎదురైన అనుభవాలను, విలువైన సలహాలను పోలీసుశాఖకు అందించాలన్నారు. ఉద్యోగ విరమణ చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందికి ఏ సమస్య వచ్చినా తాను అందుబాటులో ఉంటానని, వారికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తానని భరోసా కల్పించారు. అనంతరం, ఉద్యోగ విరమణ చేసిన డిఎస్సీ టేకి మోహనరావు, సిఐ తిరుమలరావు, హెచ్సి వాసుదేవరావు దంపతులను పోలీసుశాఖ తరుపున ఘనంగా సత్కరించి, ఆత్మీయ వీడ్కోలు పలికారు. అదే విధంగా జిల్లా కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తరుపున జిల్లా ఎస్పీ జ్ఞాపికలను, చెట్లను అందజేసారు. ఉద్యోగ విరమణ చేసిన పోలీసు ఉద్యోగులు వారి. సర్వీసులో సహకరించిన అధికారులకు, సిబ్బందికి తమ కృతజ్ఞతలు తెలిపారు. పోలీసుశాఖ తరుపున ఎస్పీ తమకు అత్మీయ వీడ్కోలు ను పలకడం, సన్మానించడం తమ జీవితంలో ఎన్నటికీ మరువలేమని కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) అస్మా ఫర్హీన్, ఎఆర్ అదనపు ఎస్పీ ఎం.ఎం.సోల్మన్, డిఎస్పీ యూనివర్స్, ఎస్బీ సిఐ ఇ.నర్సింహమూర్తి, దిశ సిఐ బి. నాగేశ్వరరావు, పోలీసు కంట్రోల్ రూం సిఐ సిహెచ్.రాజశేఖర్, ఆర్బలు గోపాల నాయుడు, భగవాన్, రమేష్ కుమార్, పోలీసు అసోసియేషను అడహక్ సభ్యులు కే.శ్రీనివాసరావు, ఆర్ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, పోలీసు కుటుంబ సభ్యులు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని, ఉద్యోగ విరమణ చేస్తున్న ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. (Story : మీ క్రమ శిక్షణ, అంకిత భావమే ఉద్యోగులకు స్పూర్తిదాయకం)