మహిళల రక్షణ, అభ్యున్నతికి పోరాటమే శరణ్యం
సిపిఐ
న్యూస్‌తెలుగు/వనపర్తి : రక్షణ, అభివృద్ధికి మహిళలు ఐక్యంగా పోరాడాలని భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి గీత, గౌరవ అధ్యక్షురాలు పి కళావతమ్మ పిలుపునిచ్చారు. మంగళవారం వనపర్తి సిపిఐ ఆఫీసులో జయమ్మ అధ్యక్షతన భారత జాతీయ మహిళా సమాఖ్య వనపర్తి పట్టణ కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొని వారు మాట్లాడారు. కేంద్రం, రాష్ట్రంలో మహిళలు బాలికలపై హత్యలు అత్యాచారాలు పెరిగిపోయాయని పోరాటాలతోనే కఠిన చట్టాలు ప్రభుత్వం తెస్తుందన్నారు. పసి పిల్లలను మైనర్లు రేప్ చేసి, కఠిన శిక్షణ నుంచి తప్పించుకుంటున్నారని, ప్రభుత్వాలు వారికి కఠిన శిక్షలు పడే మార్గం ఆలోచించాలన్నారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ చట్టం చేసిందని, దాన్నివెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో అన్ని రాజకీయ పార్టీలు మహిళలకు అత్యధిక సర్పంచ్, ఎంపిటిసి, జెడ్పిటిసి, ఎంపీపీ స్థానాలను కేటాయించాలన్నారు. రాష్ట్రం ప్రకటించిన మహిళకు రూ. 2500 ఇవ్వాలని,రూ. డిస్ట్రిబ్యూటర్ కు నేరుగా రూ. 500 ఇచ్చి సిలిండర్ తీసుకునే సౌకర్యం కలిగించాలన్నారు. ఆర్టీసీలో ఫ్రీ ప్రయాణంపై మహిళలు అవమానాలు అవహేళనలు ఎదుర్కొంటున్నారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. వనపర్తి లో మహిళా పోలీస్ స్టేషన్ ఉన్నట్లు చాలామంది మహిళలకే తెలియదని, ప్రచారం కల్పించాలన్నారు. వనపర్తి మహిళా శిశు సంక్షేమ కేంద్రానికి వెళ్లే గర్భిణీలు మహిళల పట్ల డాక్టర్లు సిబ్బంది నిర్లక్ష్యంపై చర్య తీసుకోవాలన్నారు. వనపర్తికి కేంద్రం దూరంగా ఉండటంతో గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారని వనపర్తి పట్టణంలో బ్రాంచ్ ఏర్పాటు చేయనున్నారు.
వనపర్తి లో మహిళల అవసరాలకు తగ్గట్టు షీ టీములను పెంచాలన్నారు. మహిళా సంఘాల సభ్యత్వంతో నిమిత్తం లేకుండా రేషన్ కార్డు కలిగిన ప్రతి మహిళకు పావలా వడ్డీకే రుణాలు ఇవ్వాలన్నారు. టైలరింగ్ నేర్చుకున్న మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు ఇప్పించాలని, మహిళలకు వృత్తి శిక్షణ ఇవ్వాలన్నారు. మహిళల అభివృద్ధికి, రక్షణకు మొత్తం 14 డిమాండ్లను అమలు చేయాలని తీర్మానం చేశారు. జిల్లా గౌరవ అధ్యక్షురాలు పి కళావతమ్మ, జయమ్మ, శిరీష, వెంకటమ్మ, జయశ్రీ, భూమిక, కల్పన, ప్రవల్లిక, సునీత, నాగమ్మ, శాంతి, సిపిఐ పట్టణ కమిటీ కార్యదర్శి జే రమేష్, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
నూతన కన్వీనర్ గా జయమ్మ
భారత జాతీయ మహిళా సమాఖ్య వనపర్తి పట్టణ నూతన కన్వీనర్ గా ఇరగోటి జయమ్మ ను ఎన్నుకున్నారు. కొవ్వు కన్వీనర్లుగా శిరీష, సునీత, భూమికలు ఎంపికయ్యారు. (Story : మహిళల రక్షణ, అభ్యున్నతికి పోరాటమే శరణ్యం )