నకిలీ విత్తనాలకు అడ్డాగా ఆంధ్రప్రదేశ్
తెలంగాణ తరహాలో రెండు లక్షల వరకు రైతుల రుణాలను మాఫీ చేయాలి
ఈనెల 29 నుండి 30 వరకు మదనపల్లెలో రైతు సంఘం రాష్ట్రస్థాయి సమ్మేళనాలు
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి ఈశ్వరయ్య
న్యూస్‌తెలుగు/కడప: 14 ఎన్నికల హామీలో భాగమైన 4, 5 విడుదల రుణమాఫీ పెండింగ్ బకాయిలు చెల్లించి తెలంగాణ తరహాలో రెండు లక్షల వరకు రుణమాఫీ అమలు చేయాలని సోమవారం స్థానిక ఎద్దుల ఈశ్వర్ రెడ్డి హాల్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ2014 ఎన్నికల మేనిఫెస్టోలో రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు కోటయ్య కమిటీ సిఫారసుల మేరకు ఒక లక్ష యాభై వేల వరకు రుణాలను మాఫీ చేస్తామని 50వేల వరకు మూడు దశలుగా రుణాలను మాఫీ చేసి 50 వేలకు పైబడిన రుణాలను నాలుగైదు విడుదలలో రుణమాఫీ చేస్తామని బాండ్లు ఇవ్వగా 2019 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం జరిగిందని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చిన నాలుగో విడత, ఐదో విడత బాండ్లను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోనందున రైతులు అప్పుల పాలయ్యారని 2024 ఎన్నికలలో తిరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినందున నాలుగో విడత ఐదో విడతలో మిగిలిపోయిన బ్యాంకు రుణాలను తక్షణమే మాఫీ చేయాలని కోరారు.రైతులు వేసిన పంటలు చేతికి రాక అతివృష్టితో లేదా అనావృష్టితో అప్పుల పాలయ్యారని తెలంగాణ ప్రభుత్వం చేసిన తరహాలో రెండు లక్షల వరకు షరతులు లేని రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున రైతులకు అవసరమైన రుణాలను బ్యాంకులు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం విరివిగా అందజేయాలని, రైతులు అధిక వడ్డీలతో అప్పులు పాలు కాకుండా మూడు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందజేయాలని, 5 లక్షల వరకు పావలా వడ్డీకి రుణాలు అందజేయాలని కోరారు. రాష్ట్రంలో 76 లక్షల మంది సాగుదారులు ఉండగా అందులో అధికారిక లెక్కల ప్రకారం 1,56,000 మంది కౌలు రైతులు ఉన్నారని అనధికారికంగా లక్షలాది మంది కౌలు రైతులు ఉన్నారని వారికి కూడా గుర్తింపు కార్డులు అందజేసి ప్రభుత్వం నుండి ప్రతి సాయం కవులు రైతులకు అందే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈనెల 29, 30, 31 తేదీల్లో మదనపల్లెలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్రస్థాయి సమ్మేళనాలు జరుగుతున్నాయని ఈ సమ్మేళనాలలో రైతులు, కౌలు రైతులు, పాడి రైతులు, ఉద్యానవన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడం జరుగుతుందని ఈ సమ్మేళనాలకు 26 జిల్లాల నుండి ప్రతినిధులు హాజరవుతారని, ఈ సమ్మేళనాలకు ముఖ్య అతిథులుగా అఖిలభారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య గారు, సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ ఉమ్మడి రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మాత్యులు వడ్డే శోభనాద్రిశ్వరావు, మాజీ సి.బి.ఐ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ తదితరులు హాజరవుతున్నారని తెలియజేశారు.
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కడప జిల్లా గౌరవ అధ్యక్షులు గాలి చంద్ర, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎంవి సుబ్బారెడ్డి, పోతిరెడ్డి భాస్కర్ పాల్గొన్నారు. (Story: నకిలీ విత్తనాలకు అడ్డాగా ఆంధ్రప్రదేశ్)