వర్షాలు పట్ల అప్రమత్తంగా ఉండాలి
*ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో మాట్లాడిన మంత్రి సంధ్యారాణి
*పరిస్థితులు పట్ల ఎప్పటికప్పుడు మంత్రి ఆరా
న్యూస్‌తెలుగు/ సాలూరు: వర్షాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖా, గిరిజన శాఖా మాత్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఒక ప్రకటన శనివారం విడుదల చేశారు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లతో మంత్రి మాట్లాడి పరిస్థితులపై ఆరా తీశారు. అప్రమత్తంగా ఉండాలని, యంత్రాంగాన్ని పూర్తి సన్నద్ధం చేయాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో కొండ వాగులు, గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయని, గెడ్డలు, వాగుల ప్రవాహ ఉద్ధృతి దృష్ట్యా ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలనీ అన్నారు. గెడ్డలు, వాగులను ఎవరూ దాటకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. ముందస్తు జాగ్రత్తగా పాఠశాలలకు శెలవు కూడా ప్రకటించామని చెప్పారు. పిల్లలు బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి మంత్రి సంధ్యారాణి విజ్ఞప్తి చేశారు. మత్యకారులు వేటకు వెళ్లకుండా హెచ్చరిక జారీ చేసామని, భారీ వర్షాల నేపద్యంలో శిథిల భవనాలలో ఎవరు ఉండవద్దని కోరారు. ప్రాణహాని కలగకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. అవసరమైతే పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించుటకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆమె ఆదేశించారు. ప్రజలను, సరుకులను తరలించుటకు అవసరమగు రవాణా అనుసంధానం చేయాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాలలో ఆహార సరఫరాకు ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. మధ్యాహ్న వంట ఏజెన్సీలను సిద్ధం చేయాలని ఆయన అన్నారు. చిన్నారులు, వృద్దులు, గర్భిణీలు, బాలింతలను దృష్టిలో పెట్టుకొని వారికి అవసరమగు పాలు, బిస్కెట్లు, రొట్టెలు తదితర సామాగ్రిని సిద్దంగా ఉంచాలని పేర్కొన్నారు. (వర్షాలు పట్ల అప్రమత్తంగా ఉండాలి)