పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆలపాటి గెలుపు ఖాయం
ఈ నెల 7న ఆలపాటి నామినేషన్ కార్యక్రమం విజయవంతం చేయాలి
న్యూస్ తెలుగు /వినుకొండ :ఉమ్మడి కృష్ణా – గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు ఖాయమని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఈ రెండు జిల్లాల పట్టభద్రులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువత భవిత కోసం అయన గెలుపు అనివార్యమన్నారు. విద్యార్థులు, యువత ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం కూటమి ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాలకు ఈ గెలుపు కొత్త ప్రేరణ శక్తిగా మారనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 7న గుంటూరు కలెక్టరేట్ లో ఆలపాటి రాజేంద్రప్రసాద్ నామినేషన్ దాఖలు చేస్తున్నారని ఈ కార్యక్రమానికి, వినుకొండ సహా పల్నాడు జిల్లాలోని 7 నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పట్టభద్రులు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆంజనేయులు పిలుపునిచ్చారు. బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసిన ఆయన ఇన్ని రోజులుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం కూటమి నాయకుల సమష్టి కృషి ఆలపాటి నామినేషన్ రోజున స్పష్టంగా కనిపించాలన్నారు. శుక్రవారం ఉదయం 10-12 గంటల మధ్యలో ఆయన నామపత్రాలు దాఖలు చేయనున్నారని వెల్లడించారు. (Story : పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆలపాటి గెలుపు ఖాయం)