నందిగామ రైతు బజార్‌లో బినామీ వ్యాపారాలు గుర్తింపు కార్డులు రద్దు
ఎ.డి.యమ్.అధికారిణి మంగమ్మ
న్యూస్‌తెలుగు/ఎన్టీఆర్‌జిల్లా, నందిగామ : ఎన్టీఆర్ జిల్లా నందిగామ రైతు బజార్ లో దళారుల ప్రక్షాళన జరిగింది. గత ప్రభుత్వ హయాంలో అధిక శాతం రైతు బజార్ లోని డ్వాక్రా గ్రూపులకు సంబంధించిన షాపులను కొంతమంది దళారులు గుడ్ విల్ ఇచ్చి ఇష్టానుసారంగా నడుపుకుంటున్నారు. వీరిని గతంలో ఈ రైతుబజార్ ఇఓగా పని చేసిన ఉద్యోగి ప్రోత్సాహించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఎన్నికల ముందు నూతనంగా వచ్చిన ఇఓ ఎలాంటి డ్వాక్రా షాపులను నూతనంగా ఇవ్వలేదు. అలాగే పాత వాటిని తొలగించ లేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఆకస్మికంగా రైతు బజార్ ను తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో రైతు ప్రతినిధులకు సంబంధించిన షాపులలో ఎలాంటి తప్పులు లేవని నిర్దారించారు. అయితే 16 డ్వాక్రా మహిళలకు సంబంధించిన షాపులలో ఇతరులు ఉన్నట్లు గుర్తించారు. వీరు రైతుబజార్ కు కూరగాయలు తీసుకు వచ్చే వారిని అమ్ముకొనివ్వకుండ ఆటంకాలు కలిగిస్తున్నారని, దళారులను ప్రోత్సాహం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ 16 షాపులను మూసివేయాలని, అర్హతలు, సీనియారిటీ ఉన్న నూతన గ్రూపులకు అవకాశం కల్పించాలని ఇఓకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఒక వ్యక్తి రైతు బజార్ లో రెండు డ్వాక్రా బినామీ షాపులను నడుపుతూ రైతు బజార్‌కు సమీపంలో ప్రైవేటు కూరగాయలు షాపు నడుపుతున్నారు.ఈ విషయం జిల్లా అధికారులు దృష్టికి వెళ్ళడంతో అతనికి సంబంధించిన షాపులను సైతం మూసివేయాలని ఆదేశించారు. అలాగే మరోక వ్యక్తి రైతు బజార్ లో మూడు డ్వాక్రా మహిళలకు సంబంధించిన బినామీ షాపులను నిర్వహిస్తున్నారు. వీటిని సైతం గుర్తించిన జిల్లా వ్యవసాయ అధికారులు వాటిపై కూడా చర్యలు తీసుకోనున్నారు. ఇంకా ఒక కిరాణా షాపు, మరో రెండు ఉల్లిపాయల షాపు, కవర్లు షాపులపై తనీఖీలు నిర్వహించి వాటి బినామీలను తొలగించి కొత్తవారికి అవకాశం కల్పించనున్నారు. (Story : నందిగామ రైతు బజార్‌లో బినామీ వ్యాపారాలు గుర్తింపు కార్డులు రద్దు)