విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు
న్యూస్ తెలుగు/విజయనగరం: విప్లవ జ్యోతిగా, పోరాట యోధునిగా, మన్యం వీరునిగా అల్లూరి సీతారామరాజు చిరస్మరణీయుడని నగర మేయర్ విజయలక్ష్మి అన్నారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు 127 వ జయంతి ని పురస్కరించుకొని నగరపాలక సంస్థ కార్యాలయంలో అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. కమిషనర్ ఎం.ఎం. నాయుడు, సహాయ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు, మున్సిపల్ అసోసియేషన్ అధ్యక్షుడు పట్నాల వెంకటేశ్వరరావు, ఇతర సిబ్బంది అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో అల్లూరి సీతారామరాజు చూపిన పోరాటపటిమ చరిత్ర పుటల్లో నిలిచిపోతుందన్నారు. గిరిజనుల అణచివేతను వ్యతిరేకించిన అల్లూరి సీతారామరాజు ఉద్యమ బాట పట్టి బ్రిటిష్ సైన్యాన్ని గడగడలాడించారని అన్నారు. విప్లవ జ్వాలను రగిలించిన మహాయోధుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ అమ్మాజీ రావు, టి పి ఆర్ ఓ సింహాచలం తదితరులు పాల్గొన్నారు. (Story: విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు)