కోహ్లీసేనకు షాకిచ్చిన పంజాబ్
రాయల్ ఛాలెంజర్స్ ఘోర పరాజయం
నవీ ముంబయి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అద్భుతాలు ఒక్కొక్కటిగా చోటు చేసుకుంటున్నాయి. దిల్లీ చేతిలో ముంబయి ఇండియన్స్ ఘోరంగా ఓడిన కొన్ని గంటలకే రాయల్ ఛాలెంజర్స్‌కు పంజాబ్ షాకిచ్చింది. బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. నిజానికి బెంగుళూరు భారీ స్కోరు చేసినప్పటికీ, పంజాబ్ ఏ మాత్రం తొణక్కుండా అంతకుమించిన స్కోరు చేసి బెంగుళూరుకు చావుదెబ్బ చూపించింది. విరాట్ కోహ్లీ ప్రస్తుతం బెంగుళూరుకు కెప్టెన్‌గా లేకపోయినా…నేటికీ దాన్ని కోహ్లీ సేనగానే పరిగణిస్తున్నారు. అసలు కెప్టెన్ డూప్లెసిస్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినప్పటికీ ఫలితం దక్కలేదు. భారీ స్కోరు వుండటం వల్ల గెలుపు మాదేనన్న ధీమాతో విర్రవీగిన బెంగుళూరును పంజాబ్ మట్టికరిపించింది. డివై పాటిల్ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన మూడవ లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్‌సీబీ)పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీస్కోరు చేయగా, పంజాబ్ కింగ్స్ ఇంకా ఒక ఓవర్ మిగిలివుండగానే 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 208 పరుగులు చేసి విజయకేతనం ఎగురవేసింది. మయాంక్ అగర్వాల్ కెప్టెన్సీలో తొలి మ్యాచ్ ఆడిన పంజాబ్ తీయని విజయాన్ని రుచిచూసింది.
భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఆరంభం నుంచీ దూకుడుగా ఆడిరది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 32, శిఖర్ ధావన్ 29 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 43, భనూక రాజపక్ష కేవలం 22 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 43, లియామ్ లివింగ్‌స్టోన్ 2 సిక్సర్లతో 19 (10 బంతులు), షారూఖ్ ఖాన్ 20 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 24 (నాటౌట్), ఒడియన్ స్మిత్ కేవలం 8 బంతుల్లోనే 1 ఫోర్, 3 సిక్సర్లతో 25 (నాటౌట్) పరుగులు చేసి మెరుపులు మెరిపించారు. దాదాపు అందరూ యువ ఆటగాళ్లే కావడంతో ఏ ఒక్కరూ వెరవకుండా డూప్లెసిస్ టీమ్‌ను బాదిపారేశారు. ఆర్‌సీబీ బౌలర్లలో సిరాజ్ రెండు వికెట్లు తీసుకోగా, హర్షల్ పటేల్, హసరంగ, ఆకాష్‌దీప్‌లు ఒక్కొక్క వికెట్టు చొప్పున తీసుకున్నారు.
అంతకుముందు పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ముందుగా ఆర్‌సీబీని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే ఆర్‌సీబీ ఏ మాత్రం తగ్గకుండా భారీస్కోరే లక్ష్యంగా బ్యాటింగ్ ధాటిగా చేసింది. ఫఫ్ డుప్లెసిస్ కేవలం 57 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 88 పరుగులు చేశాడు. ఆ తర్వాత అనురావత్ (21) కొంతమేరకు రాణించాడు. విరాట్ కోహ్లీ, దినేష్ కార్తిక్‌లు పరుగుల వర్షం కురిపించారు. కోహ్లీ 29 బంతుల్లోనే 1 ఫోర్, 2 సిక్సర్లతో 41, కార్తిక్ 14 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 32 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. జట్టు స్కోరు 168 పరుగుల వరకూ డుప్లెసిస్ క్రీజ్‌లోనే వుండటం విశేషం. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, రాహుల్ చాహర్‌లు చెరొక వికెట్టు తీసుకున్నారు. (Story: కోహ్లీసేనకు షాకిచ్చిన పంజాబ్)
See Also: నిరుద్యోగులకు తీపికబురు!
ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)
తొలిరోజే ఆర్‌ఆర్‌ఆర్ కలెక్షన్ల తుఫాన్!