సీపీఐకి డాక్టర్ సుధాకర్ గుడ్‌బై!
పార్టీలో అలక్ష్య ధోరణే రాజీనామాకు కారణం
కమ్యూనిస్టుపార్టీ హైదరాబాద్ శాఖకు షాక్
ఆమ్ ఆద్మీ పార్టీలో చేరికకు రంగం సిద్ధం
హైదరాబాద్: కమ్యూనిస్టు లెజెండ్ రాజ్‌బహదూర్ గౌర్ బంధువు, తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ప్రముఖ నాయకుడు డాక్టర్ సుధాకర్ సీపీఐకి గుడ్‌బై చెప్పారు. ఆకస్మికంగా తన రాజీనామాను ప్రకటించారు. పార్టీలో పేరుకుపోయిన అలక్ష్యధోరణి, ఒక సామాజిక వర్గం పెత్తనం భరించలేకనే ఆయన పార్టీకి రాజీనామా చేసినట్లుగా సమాచారం. కమ్యూనిస్టు పార్టీ హైదరాబాద్ శాఖలో కీలక పాత్ర పోషిస్తున్న సుధాకర్ రాజీనామా ఈ శాఖకు షాక్‌గా భావిస్తున్నారు. ముక్కుసూటిగా మాట్లాడటమే వ్యక్తిత్వంగా ఉండే సుధాకర్ అంటే సహజంగానే ఒక వర్గానికి సరిపడదని తెలిసింది. పార్టీలో నెలకొన్న కొన్ని సమస్యలపై స్పందించాలని, చర్చించాలని తరచూ ఆయన పార్టీ నాయకత్వానికి లేఖల ద్వారా, ప్రత్యక్షంగా డిమాండ్ చేసి వున్నారు. అయితే వాటిపై పార్టీ ఏనాడూ స్పందించలేదన్నది ఆయన ఆరోపణ. ఆయన వ్యక్తిత్వం గురించి తెలిసిన ఆప్ పార్టీ నేతలు ఆయనను పార్టీలో చేరాల్సిందిగా సంప్రదించినట్లు తెలిసింది. దీంతో డాక్టర్ సుధాకర్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఏప్రిల్ 14వ తేదీని ముహూర్తంగా పెట్టుకున్నట్లు సమాచారం. మీడియాకు ఇచ్చిన పలు ఇంటర్వ్యూల్లో ఆయన సీపీఐ నాయకత్వ అలక్ష్యధోరణిని ఎండగట్టారు. సీపీఐ తెలంగాణ సమితి కార్యదర్శివర్గంతోపాటు హైదరాబాద్ శాఖలో పనిచేస్తున్న ముగ్గురు ప్రధాన నాయకుల అవినీతిని ఆయన దుయ్యబట్టారు. ఆర్థిక లొసుగులు, అవకతవకలను కూడా ప్రశ్నించానని, అందుకే పార్టీ నాయకత్వం పొమ్మనలేక పొగబెట్టినట్లు చెప్పారు. ఏదేమైనప్పటికీ, ఆమ్ ఆద్మీ పార్టీలోనూ మంచి నాయకుడిగా రాణించాలని కోరుకుంటున్నట్లు డాక్టర్ సుధాకర్ తెలిపారు. (Story: సీపీఐకి డాక్టర్ సుధాకర్ గుడ్‌బై!)
See Also: నిరుద్యోగులకు తీపికబురు!
ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)
తొలిరోజే ఆర్‌ఆర్‌ఆర్ కలెక్షన్ల తుఫాన్!