నిబంధనలు పాఠించండి- రహదారి భద్రతకు సహకరించండి
నిబంధనలు పాటించకుంటే ఆటోలను సీజ్ చేస్తాం
న్యూస్‌తెలుగు/విజయనగరం : పట్టణంలోని మెసానిక్ టెంపుల్ నందు ట్రాఫిక్ పోలీసుల అధ్వర్యంలో రహదారి భద్రత పట్ల ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించేందుకు నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – రహదారి భద్రత అందరి బాధ్యతని అన్నారు. ఆటో డ్రైవర్లు నిర్లక్ష్యం కారణంగా ఎక్కువగా రహదారి ప్రమాదాలు, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఆటో డ్రైవర్లు నిబంధనలు మేరకు నడుచుకుంటే రహదారి ప్రమాదాలు తగ్గడమే కాకుండా, చాలా వరకు ట్రాఫిక్ అవాంతరాలు ఉండవన్నారు. ఆటో డ్రైవర్లుకు తప్పనిసరిగా రహదారి భద్రత నియమాలు తెలియాలన్నారు. తాము డ్రైవ్ చేసే ఆటోలకు రిజిస్ట్రేషను పత్రం, ఆటోలను నడిపేందుకు డ్రైవింగు లైసెన్సు, ప్రమదాల్లో గాయపడిన లేదా మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు ఇన్సూరెన్సు, కాలుష్యం నియంత్రణకు పొల్యూషను ధృవ పత్రం తప్పనిసరిగా ఉండాలన్నారు. అంతేకాకుండా, ముఖ్య కూడళ్ళలో ఆటోలను సక్రమంగా క్రమ పద్ధతిలో నిలుపుకోవాలని, అర్టీసి కాంప్లెక్సు, ఎత్తు బ్రిడ్జి, కోట జంక్షను, దాసన్నపేట రైతు బజారు వద్ద ఆటోలను అస్తవ్యస్తంగా నిలపడం వలన ఇతర వాహనాల రాక పోకలకు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను అనుమతించవద్దని, డ్రైవరు సీటులోకి ప్రయాణికులను కూర్చోబెట్టవద్దని, ఆటో డ్రైవర్లు యూనిఫాం ధరించాలని, నిబంధనలకు విరుద్ధంగా ఆటోల్లోకి స్కూలు పిల్లలను అనుమతించవద్దన్నారు. ప్రతీ ఆటో డ్రైవరు రహదారి భద్రత నియమాలు పాటించి, రహదారి ప్రమాదాలను నియంత్రించేందుకు పోలీసుశాఖకు సహకరించాలని కోరారు. కాలేజ్ అమ్మాయిలను ఆటో డ్రైవర్లు ఎక్కువగా ట్రాప్ చేస్తూ, పోక్సో కేసుల్లో నిందితులుగా మారుతున్నారన్నారు. మైనరు బాలికల సమ్మతితో శారీరక సంబంధాలు ఏర్పరుచుకున్నా.. అది పోక్సో చట్టం ప్రకారం తీవ్రమైన నేరమేనన్నారు. ఈ విషయాన్ని ఆటో డ్రైవర్లు గ్రహించాలని కోరారు. ఈ తరహా కేసుల్లో ఆటో డ్రైవర్లు ఎక్కువగా నిందితులుగా మారుతున్నారని, అటువంటి వాటికి స్వస్తి పలకాలన్నారు. అంతేకాకుండా, ఆటోల్లో ప్రయాణించే మహిళలు పట్ల కూడా కొంతమంది ఆటోడ్రైవర్లు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లుగా పోలీసుల దృష్టికి వచ్చిందన్నారు. ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఆటోడ్రైవర్లు స్వస్తి పలికి, రహదారి భద్రత నియమాలు పాటిస్తూ, నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటే పోలీసుశాఖ కూడా సహకరిస్తుందన్నారు. అలాకాకుండా, నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు కలుగజేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆటో డ్రైవర్లను హెచ్చరించారు. ఆటో డ్రైవర్లకు ఏమైనా సమస్యలుంటే పోలీసువారి దృష్టికి తీసుకొని వస్తే, వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. ఇకపై ఎం.వి.నిబంధనలకు వ్యతిరేకంగా అటో డ్రైవర్లు ప్రవర్తిస్తే వారి వాహనాలను సీజ్ చేస్తామని, కొత్త మోటారు వాహన చట్టం ప్రకారం ఈ-చలానాలను విధిస్తామన్నారు. కావున, ప్రజలకు, ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా రహదారి భద్రత నియమాలు పాటించాలని, ఆటోలను వారికి నిర్ధేశించిన పార్కింగు స్థలాల్లోను, ఆటో స్టాండుల్లో, క్రమ పద్దతిలో మాత్రమే పార్కింగు చేసుకోవాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆటో డ్రైవర్లను కోరారు.ట్రాఫిక్ సిఐ సూరి నాయుడు మాట్లాడుతూ – జిల్లా వ్యాప్తంగా 22,000 ఆటోలు ఉన్నాయని, విజయనగరం పట్టణంలో సుమారు 5,800 ఆటోలు ప్రతీ రోజూ తిరుగుతుంటాయన్నారు. పట్టణంలోని రోడ్లపై ఆటో డ్రైవర్లు నిర్లక్ష్యంగా అస్తవ్యస్తంగా పార్కింగు చేయడం వలన ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఈ సం. ఆటోల కారణంగా 52రహదారి ప్రమాదాలు జరగ్గా, ఆయా ప్రమాదాల్లో 13మంది మృతి చెందారని, 73 మంది గాయపడ్డారన్నారు. కావున,ఆటో డ్రైవర్లు నిబంధనల ప్రకారం నడుచుకుంటూ, నిర్దేశించిన ప్రాంతాల్లో క్రమ పద్ధతిలో పార్కింగు చేసుకోవాలని, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.
రోడ్డు సేఫ్టీ ఎస్.జి.ఓ. అధ్యక్షులు మజ్జి అప్పారావు మాట్లాడుతూ – జిల్లా ఎస్పీ అటో డ్రైవర్లుతో సమావేశం నిర్వహించి, రహదారి భద్రత పట్ల అవగాహన కల్పించడం శుభపరిణామమన్నారు. ప్రమాదాలు జరిగినపుడు ఆటోడ్రైవర్లు గాయపడిన వ్యక్తులను సకాలంలో ఆసుపత్రులకు తరలించి, వారి ప్రాణాలను కాపాడాలన్నారు. బాధితులనుకాపాడే వారిని కేంద్ర ప్రభుత్వం, పోలీసుశాఖ ప్రోత్సహిస్తుందన్నారు.
ఈ అవగాహన కార్యక్రమంలో ఎస్బీ సిఐ కే.కే.వి.విజయనాధ్, వన్ టౌన్ సిఐ ఎస్.శ్రీనివాస్, టూ టౌన్ సీఐ టి.శ్రీనివాసరావు, ఎస్ ఐలు ఎ.మహేశ్వరరాజు, శంబాన రవి, నవీన్ పడాల్, ఇతర పోలీసు అధికారులు, పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. (Story : నిబంధనలు పాఠించండి- రహదారి భద్రతకు సహకరించండి)