రైతు ఉద్యమ నాయకుడికి జడ్పీ వైస్ చైర్మన్ పదవి దక్కేనా?
కూటమి ధర్మాన్ని నిలబెట్టుకోవాలి -విలీన మండలాల బీజేపీ నాయకులు
న్యూస్‌తెలుగు/చింతూరు: రైతుల పక్షాన నిలబడి పోరాటాలు చేసిన నాయకుడికి కూటమి ప్రభుత్వం తగిన గుర్తింపు ఇస్తుందా? అనే చర్చ ప్రస్తుతం నాలుగు విలీన మండలాల్లో ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా రైతు ఉద్యమ నాయకుడిగా గుర్తింపు పొందిన పాయం వెంకయ్యకు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవి కేటాయించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఎన్నికల సమయంలో విలీన మండలాలకు ప్రాధాన్యత ఇస్తామని, వైస్ చైర్మన్ పదవిని ఈ ప్రాంతానికే కేటాయిస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు హామీ ఇచ్చినట్లు స్థానికులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకునే సమయం వచ్చిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
కూటమి ధర్మాన్ని పాటించిన బీజేపీ
విలీన మండలాల్లో కూటమి తరఫున పోటీ చేసిన అభ్యర్థుల విజయానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు తమ శక్తివంచన లేకుండా కృషి చేశారు. తమకు కేటాయించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారు. ఎక్కడా కూటమికి ఇబ్బంది కలిగించే విధంగా రెబల్ అభ్యర్థులను బరిలోకి దించకుండా మిత్రధర్మాన్ని పాటించారు. కూటమి అభ్యర్థులందరి విజయానికి సహకరించారు. అలాంటి పరిస్థితుల్లో కూటమి నాయకత్వం కూడా మిత్రధర్మాన్ని పాటించి విలీన మండలాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
రైతుల కష్టాలు తెలిసిన నాయకుడు -పాయం వెంకయ్య
రైతు కుటుంబంలో పుట్టి, ఇప్పటికీ వ్యవసాయం చేస్తూ రైతుల కష్టాలను ప్రత్యక్షంగా అనుభవిస్తున్న వ్యక్తి పాయం వెంకయ్య. రైతులకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చే నాయకుడిగా ఆయనకు ఈ ప్రాంతంలో గుర్తింపు ఉంది. పేద ప్రజల బాధలను, గిరిజన కుటుంబాల ఇబ్బందులను దగ్గరగా తెలుసుకుని వారికి అండగా నిలుస్తుంటారని స్థానికులు చెబుతున్నారు.
కులమతాలకు అతీతంగా అందరితో ఆప్యాయంగా మెలిగే వ్యక్తిగా, ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగిన నాయకుడిగా ఆయనకు మంచి ఆదరణ ఉంది. జడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించడం ఆయనకు ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనంగా నిలుస్తోంది.
పోలవరం కష్టాలు ఎదుర్కొంటున్న ప్రాంతానికి ప్రాతినిధ్యం అవసరం
పోలవరం ప్రాజెక్టు కారణంగా విలీన మండలాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. పునరావాసం, భూములు, సాగు, రహదారులు, విద్య, వైద్యం వంటి అనేక సమస్యలతో ఈ ప్రాంత ప్రజలు సతమతమవుతున్నారు. అభివృద్ధిలోనూ ఇతర ప్రాంతాలతో సమానంగా ముందుకు వెళ్లాలంటే జిల్లా పరిషత్‌లో ఈ ప్రాంతానికి బలమైన ప్రాతినిధ్యం అవసరమని ప్రజలు భావిస్తున్నారు.
నాలుగు విలీన మండలాల సమస్యలను జిల్లా పరిషత్ వేదికగా బలంగా వినిపించాలంటే ఈ ప్రాంతానికి చెందిన నాయకుడికి వైస్ చైర్మన్ పదవి ఇవ్వడం సముచితమని స్థానికుల అభిప్రాయం.
మాట నిలబెట్టుకుంటారా.. మిత్రధర్మం పాటిస్తారా?
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కూటమి నాయకులు ఇప్పుడు నిలబెట్టుకుంటారా? కూటమి విజయానికి కృషి చేసిన బీజేపీకి తగిన గుర్తింపు ఇస్తారా? రైతుల కోసం పోరాడిన పాయం వెంకయ్యకు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవి కేటాయిస్తారా? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
పదవులు కేవలం రాజకీయ సమీకరణాల కోసం కాకుండా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగపడాలని ప్రజలు కోరుతున్నారు. విలీన మండలాల ప్రజల కష్టాలను అర్థం చేసుకునే నాయకుడికి అవకాశం కల్పిస్తే ఈ ప్రాంత సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. (Story: రైతు ఉద్యమ నాయకుడికి జడ్పీ వైస్ చైర్మన్ పదవి దక్కేనా?)
-
Top Stories You Can See
- అందం మీ సొంతం: సహజ నిగారింపుకు 6 పోషకాలు!
- బాదం పప్పులు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా?
- మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
- వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
- దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
- ఆ చేప కన్పిస్తే…సునామీనే!
- ఒకే ఆసుపత్రిలో 11 మంది స్టాఫ్ ఒకేసారి గర్భం దాల్చారు!
-
మల్లెపూలతో తెల్లార్లూ…!

