వర్క్ ఫ్రమ్ హోమ్‌కు బైబై
ఏప్రిల్ 1 నుంచి ఆఫీసు మెట్లెక్కాల్సిందే
హైదరాబాద్ : కొవిడ్ 19 రోగం రెండేళ్లకు పైగా, మూడు దశలుగా మనల్ని వేధించింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోగగ్రస్తులు కాగా, లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. తొలి రెండు దశల కరోనా జనాన్ని విపరీతంగా భయపెట్టింది. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే భయంభయంగా ఉండేది. అయితే వ్యాక్సినేషన్లు పెరగడం, కరోనా పట్ల అవగాహన పెంపొందించుకోవడం, ఆరోగ్యవంతమైన జీవనశైలికి అలవాటుపడటం వంటి కారణాల వల్ల కరోనా మూడో దశను పెద్దగా కేర్ చేయలేదు. నిజానికి దాని ప్రభావం కూడా తక్కువే. కరోనాతో జీవితాంతం సహజీవనం తప్పనిసరి అని అందరికీ తెల్సిందే. అయినప్పటికీ, మూడో దశ ప్రభావం అంతగా లేనికారణంగా జనం కూడా సాధారణ జీవనానికి అలవాటుపడుతున్నారు. ఈసారి ప్రభుత్వాల నుంచి గానీ, కార్యాలయాల నుంచి గానీ ఆంక్షలు కూడా తక్కువగానే వున్నాయి. అందుకే రెండేళ్ల క్రితానికి ప్రజలు వెళ్తున్నారు. ఇప్పటివరకు చాలా కార్యాలయాలు ముఖ్యంగా ఐటీ ఆఫీసులు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అవకాశం ఇచ్చాయి. కరోనా ప్రభావం తగ్గడం వల్ల ఇక ఐటీ ఆఫీసులతో సహా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు ఇంటి నుంచి పనికి గుడ్‌బై చెప్పనున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆఫీసులకు వచ్చి పనిచేయాలన్న ఆదేశాలు ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నాయి. వాస్తవానికి ఉద్యోగులు కూడా అందుకు సిద్ధమవుతున్నారు. కొన్ని ఐటీ ఆఫీసులు ఇప్పటికే తమ ఉద్యోగులకు మెసేజ్‌లు పెట్టాయి. వెంటనే ఆఫీసులకు రావాలని కోరాయి.
తెలుగు రాష్ట్రాల్లో…
ఏప్రిల్ 1 నుంచి కార్యాలయాల్లో పనిచేసేందుకు సన్నద్ధం కావాలని ఐటీ సంస్థల యాజమాన్యాలు తమ సిబ్బందికి సందేశాలు పంపుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 1500కు పైగా ఉన్న ఐటీ కంపెనీల్లో దాదాపు 6.28 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో ప్రస్తుతం 90 శాతం మంది వరకు ఇంటి నుంచే పని చేస్తున్నారు. దీనివల్ల ఐటీ రంగంపై ఆధారపడిన ఇతర వర్గాల ఉపాధిపై ప్రభావం పడింది. కార్యాలయాల్లో పనిని పునరుద్ధరిస్తే ఆ వర్గాల ఉపాధికి భరోసా వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో దాదాపు 40 శాతం మంది నగరానికి దూరంగా సొంతూళ్లలో ఉన్నారు. వారంతా తిరిగి వచ్చి, అద్దె ఇళ్లు వెతుక్కోవడం, వసతిగృహాల్లో చేరడానికి వీలుగా కంపెనీలు ముందస్తుగా అప్రమత్తం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడిప్పుడే ఐటీ రంగం అభివృద్ధి చెందుతోంది. అమరావతి, వైజాగ్‌లలో ఎక్కువగా ఐటీ కంపెనీలు ఉన్నాయి. దాదాపు 1200కి పైగా ఏపీలో ఐటీ కంపెనీలు ఉన్నట్లుగా సమాచారం. ఈ సంస్థల్లో కనీసం నాలుగున్నర లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో 70 శాతం మంది ఇప్పటికే వర్క్ ఫ్రం హోమ్ విధానంలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ కంపెనీల యాజమాన్యాలు సైతం వర్క్ ఫ్రం హోమ్‌కు గుడ్‌బై చెప్పే ప్లాన్‌లో వున్నాయి. అమరావతి, వైజాగ్‌లలో ఉన్న ఐటీ కంపెనీల్లో మెజారిటీ కంపెనీలు బెంగళూరు, హైదరాబాద్ సంస్థలకు బ్రాంచి ఆఫీసులుగానే వున్నాయి. హైదరాబాద్, బెంగళూరులలో ఆఫీసులకు వచ్చి పనిచేయడం మొదలుకాగానే, ఇక్కడ కూడా వర్క్ ఫ్రం హోమ్ కాన్సెప్ట్ కు గుడ్‌బై చెప్పనున్నారు. ఐటీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. కొన్ని సంస్థలు ఉద్యోగులందరినీ ఒకేసారి కాకుండా ప్రాజెక్టుల వారీగా రప్పించాలని కంపెనీలు యోచిస్తున్నాయి. ఒక ప్రాజెక్టులో పనిచేసే ఉద్యోగులందరినీ ఒకేసారి కాకుండా… గ్రూపులుగా విభజించనున్నాయి. తొలుత వారానికి 2-3 రోజులు కార్యాలయాల్లో, మిగతా రోజులు ఇంటి నుంచి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొంటున్నట్లుగా సమాచారం. కరోనాతో రెండేళ్లుగా ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తుండటం వల్ల వే ఆఫ్ డిస్కషన్, థీమ్ ఆఫ్ డిస్కషన్, గుడ్ రిజల్ట్ ఫ్రం డిస్కషన్ వంటి అంశాల విషయంలో ఐటీ కంపెనీలకు నష్టాలే జరిగాయి. అందుకే ఆఫీసులకు రావడం ఉత్తమమని భావిస్తున్నాయి. ప్రస్తుతం కార్యాలయాలకు పది శాతం మంది వస్తున్నారు. ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేందుకు ఐటీ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం అధికారికంగా కార్యాలయం నుంచి పని ప్రారంభించుకోవచ్చని తెలిపింది. ఏప్రిల్ నుంచి ఉద్యోగులు కార్యాలయాలకు వస్తారని ఒక సంస్థ బాధ్యుడు చెపుతున్నారు. (Story : వర్క్ ఫ్రమ్ హోమ్‌కు బైబై)
- See Also : పిల్లలకు వ్యాక్సిన్ ఓకేనా?
- కరోనా తగ్గుముఖం