నాయీబ్రాహ్మణులకు శాసనమండలిలో అవకాశం కల్పించాలి
ఆంధ్రప్రదేశ్ నాయీబ్రాహ్మణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ నరసింహారావు
న్యూస్ తెలుగు / వినుకొండ : స్వాతంత్రం సిద్ధించి ఏడున్నర దశాబ్దాలు దాటినప్పటికీ నాయి బ్రాహ్మణులు ఓట్లు వేసే యంత్రాలుగా మిగిలిపోయారని గత ప్రభుత్వంలో నాయీ బ్రాహ్మణులకు ఎమ్మెల్సీ ఇస్తామనే హామీని నెరవేర్చకుండా నిరాశ కి గురి చేశారని , కూటమి ప్రభుత్వంలో నాయి బ్రాహ్మణులకు శాసన మండలలో అవకాశం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ నాయీబ్రాహ్మణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ నరసింహారావు ఆశాభావం వ్యక్తం చేశారు. వినుకొండ లో జరిగిన విలేకరుల సమావేశంలో తాటికొండ నరసింహారావు మాట్లాడుతూ. నాయి బ్రాహ్మణులపై రాష్ట్రవ్యాప్తంగా అనేక దాడులు గతంలో జరిగాయని, హత్యలు, అత్యాచారయత్నాలు అధికమవుతున్న దృష్ట్యా నాయి బ్రాహ్మణులకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని కోరారు. నాయీబ్రాహ్మణ వృత్తి దారుల పొట్ట కొడుతున్న కార్పొరేట్ శక్తులను నివారించాలని, అనాదిగా వృత్తి ని నమ్ముకుని జీవిస్తున్న నాయీబ్రాహ్మణులకు పేటెంటు హక్కు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఆధునిక సెలూన్స్ ఏర్పాటు చేసుకునుటకు యూనిట్ కు పది లక్షల రూపాయలు సబ్సిడీ రుణాల అందించాలని, రాష్ట్ర వ్యాప్తంగా నాయి బ్రాహ్మణులు కార్యక్రమాలు నిర్వహించుకొనుటకు రాజధాని ఏరియాలో ఐదు ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాయీబ్రాహ్మణ జేఏసీ యువజన విభాగం రాష్ట్ర కన్వీనర్ కొర్నేపాటి నరేష్ మాట్లాడుతూ. దేవాలయాలలో, పోలీసు డిపార్ట్మెంట్లో, ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే బార్బరులను పర్మినెంట్ చేయాలని రాష్ట్రంలో మూడు ప్రాంతాలలో మూడు వాయిద్య సంగీత పాఠశాలల ను ఏర్పాటు చేయాలని, జననాయక్ భారతరత్న అవార్డు గ్రహీత కర్పూరి ఠాగూర్ విగ్రహాలను ప్రతి జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం బ్రహ్మం, వంగపాటి వాసు ముద్దపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. (Story : నాయీబ్రాహ్మణులకు శాసనమండలిలో అవకాశం కల్పించాలి)

