సంచిత్ గంగ్వార్ కు ఘనంగా వీడ్కోలు
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లాలో సంచిత్ గంగ్వార్ అదనపు కలక్టర్ స్థానిక సంస్థల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రశంసించారు. 16 డిసెంబర్, 2023 నుండి అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గా బాధ్యతలు నిర్వర్తించిన సంచిత్ గంగ్వార్ ఈ నెల 21న అదనపు కలక్టర్ గా నారాయణపేటకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం వనపర్తి ఐ .డి. ఒ.సి సమావేశ మందిరంలో సంచిత్ గంగ్వార్ కు ఘనంగా వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో గాని స్థానిక సంస్థల నిర్వహణలో గాని చాలా బాగా పనిచేశారని కొనియాడారు. జిల్లా కలెక్టర్ తరఫున, రెవెన్యూ, జిల్లా అధికారులు, మండల అధికారుల తరఫున సంచిత్ కు శాలువాలు, పూల మొక్కలతో ఘనంగా సన్మానం చేసారు. బదిలీ పై వెళుతున్న సంచిత్ గంగ్వార్ మాట్లాడుతూ పోస్టింగ్ తీసుకున్నాక మొదటగా వనపర్తి జిల్లాలో విధులు నిర్వహించడం జరిగిందని, చాలా విషయాలు నేర్చుకోవడం జరిగిందన్నారు. అధికారులు అందరూ బాగా పనిచేసి సహకరించడం వల్ల సమర్థవంతంగా పనిచేయడం జరిగిందని తెలిపారు. (Story : సంచిత్ గంగ్వార్ కు ఘనంగా వీడ్కోలు)