చింతూరు డివిజన్లో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
ప్రమాదకర ప్రాంతాలు, బ్లాక్ స్పాట్లను సంయుక్తంగా పరిశీలించిన ఐటీడీఏ పీవో, పోలీస్,సంబంధిత శాఖల అధికారులు
డిసెంబర్ నుంచి డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్‌పై కఠిన తనిఖీలు – వాహనదారులు 15 రోజుల్లోగా తప్పనిసరిగా నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలి: ఐటీడీఏ పీవో
న్యూస్‌తెలుగు/చింతూరు: చింతూరు డివిజన్ పరిధిలో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్న నేపథ్యంలో, ప్రమాదాల నివారణకు,ప్రజల ప్రాణ రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, సబ్ కలెక్టర్ శ్రీ చిట్టపులి నరేంద్ర పడాల్ తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం చింతూరు డివిజన్ పరిధిలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలు, ప్రమాదకర మలుపులు,గుర్తించిన బ్లాక్ స్పాట్లను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, చిట్టపులి నరేంద్ర పడాల్,, చింతూరు డీఎస్పీ ఉదయ్ పావని, సీఐ, చింతూరు తహశీల్దార్, నేషనల్ హైవే అసిస్టెంట్ ఇంజనీర్,తదితర అధికారులతో కలిసి సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్న ప్రాంతాల్లో రహదారుల పరిస్థితి, ప్రమాదకర మలుపులు, రోడ్డు మార్గాల వెడల్పు, వాహనాల రాకపోకలు, రహదారి సూచిక బోర్డులు, హెచ్చరిక బోర్డులు తదితర అంశాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రమాదాలకు దారితీస్తున్న కారణాలను గుర్తించి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చించారు.
రోడ్డు భద్రతకు ప్రత్యేక చర్యలు
రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు నేషనల్ హైవే అధికారులు పలు కీలక సూచనలు చేశారు. ప్రమాదకర మలుపులు, బ్లాక్ స్పాట్ల వద్ద అవసరమైన హెచ్చరిక బోర్డులు, రోడ్డు భద్రతా సూచికలు ఏర్పాటు చేయడం, వాహనదారులకు ముందస్తు సమాచారం అందించేలా చర్యలు తీసుకోవడం, అవసరమైన చోట రహదారి భద్రతా మెరుగుదలలు చేపట్టడం వంటి అంశాలను పరిశీలించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో సంబంధిత శాఖల సమన్వయంతో తగిన రక్షణ చర్యలు చేపట్టి, రోడ్డు ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు కృషి చేయాలని ఐటీడీఏ పీవో అధికారులకు సూచించారు.
డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ తప్పనిసరి
ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో మాట్లాడుతూ, చింతూరు డివిజన్ పరిధిలో వాహనాలు నడుపుతున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ప్రతి వాహనానికి చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ ఉండాలని స్పష్టం చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు, వాహన రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోని వారు వెంటనే స్పందించి 15 రోజుల్లోగా సంబంధిత ఆర్టీఓ కార్యాలయం ద్వారా అవసరమైన నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. అలాగే, డిసెంబర్ నెల నుంచి పోలీస్ శాఖ, రవాణా శాఖ,అధికారులు డివిజన్ పరిధిలో తరచుగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నారని, ఈ తనిఖీలను కఠినంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేదా వాహన రిజిస్ట్రేషన్ లేకుండా వాహనాలు నడిపే వారిపై నిబంధనల ప్రకారం జరిమానాలు,ఇతర చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.
వాహనదారులకు ముఖ్య సూచనలు…
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలి .
చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు మాత్రమే వాహనాలు నడపాలి.
ప్రతి వాహనానికి తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ ఉండాలి.
ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్ రైడింగ్ చేయరాదు.
మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపరాదు.
నిర్ణీత వేగ పరిమితిని పాటిస్తూ, అతివేగం మరియు నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలన్నా రు .
వాహనం నడిపే సమయంలో మొబైల్ ఫోన్లు ఉపయోగించరాదు.
కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాల్లో ప్రయాణించే వారు తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాలి.
రహదారి సూచికలు, హెచ్చరిక బోర్డులు మరియు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి.
ప్రజల సహకారంతోనే ప్రమాదాల నివారణ సాధ్యం
రోడ్డు ప్రమాదాలు కేవలం ఒక కుటుంబానికే కాకుండా సమాజానికి కూడా తీరని నష్టాన్ని కలిగిస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఒక్క చిన్న నిర్లక్ష్యం విలువైన ప్రాణాలను బలిగొనే ప్రమాదం ఉందని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతను తమ వ్యక్తిగత బాధ్యతగా భావించాలని సూచించారు. ప్రభుత్వ శాఖలు తమవంతుగా రహదారి భద్రతా చర్యలు చేపడుతున్నప్పటికీ, ప్రజలు కూడా ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించినప్పుడే ప్రమాదాలను సమర్థవంతంగా నివారించగలమని తెలిపారు. “మీ భద్రత – మీ కుటుంబ భవిష్యత్తు. రోడ్డు నియమాలు పాటించండి, చట్టబద్ధమైన పత్రాలతో వాహనాలు నడపండి, ప్రమాదాలను నివారించండి, విలువైన ప్రాణాలను కాపాడండి” అని చింతూరు డివిజన్ ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు. (Story: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు)
-
Top Stories You Can See
- అందం మీ సొంతం: సహజ నిగారింపుకు 6 పోషకాలు!
- బాదం పప్పులు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా?
- మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
- వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
- దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
- ఆ చేప కన్పిస్తే…సునామీనే!
- ఒకే ఆసుపత్రిలో 11 మంది స్టాఫ్ ఒకేసారి గర్భం దాల్చారు!
-
మల్లెపూలతో తెల్లార్లూ…!

