Homeవార్తలుసిస్టమ్స్‌ బయాలజీ ఇన్‌స్టిట్యూట్‌తో గ్లోబల్‌ యూనివర్సిటీ ఫౌండేషన్‌ భాగస్వామ్యం

సిస్టమ్స్‌ బయాలజీ ఇన్‌స్టిట్యూట్‌తో గ్లోబల్‌ యూనివర్సిటీ ఫౌండేషన్‌ భాగస్వామ్యం

జపాన్‌కు చెందిన సిస్టమ్స్‌ బయాలజీ ఇన్‌స్టిట్యూట్‌తో వ్యూహాత్మక శాస్త్రీయ భాగస్వామ్యం చేసుకున్న గ్లోబల్‌ యూనివర్సిటీ ఫౌండేషన్‌

హైదరాబాద్‌, నవంబర్‌ 2, 2026: డాక్టర్‌ రవీంద్రనాథ్‌ కంచెర్ల నాయకత్వంలో గ్లోబల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ (గిరి) పేరిట కార్యకలాపాలు నిర్వహిస్తున్న గ్లోబల్‌ యూనివర్సిటీ ఫౌండేషన్‌ (జీయూఎఫ్‌), జపాన్‌కు చెందిన సిస్టమ్స్‌ బయాలజీ ఇన్‌స్టిట్యూట్‌ (ఎస్‌బీఐ)తో వ్యూహాత్మక శాస్త్రీయ భాగస్వామ్యాన్ని చేసుకున్నట్లు ప్రకటించింది. ఎస్‌బీఐ అధ్యక్షుడు డాక్టర్‌ హిరోఆకి కిటానో హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా ఈ ప్రకటన వెలువడింది. 2026 నవంబర్‌ 1న పరిశోధన సహకార ఒప్పందంపై సంతకాలు చేయడం ద్వారా ఈ భాగస్వామ్యానికి అధికారిక రూపం లభించింది. హైదరాబాద్‌లో సమీకృత విశ్వవిద్యాలయం, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను నిర్మించాలన్న జీయూఎఫ్‌ లక్ష్యానికి ఈ భాగస్వామ్యం తోడ్పడనుంది.

గ్లోబల్‌ యూనివర్సిటీ ఫౌండేషన్‌ ఏర్పాటు లక్ష్యంకు డాక్టర్‌ రవీంద్రనాథ్‌ కంచెర్లతో పాటు ఇతర కీలక నాయకులు, సహకార భాగస్వాములు ప్రకటించిన 250 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల నిధుల నిబద్ధత మద్దతుగా నిలుస్తోంది. ఈ నిధులను సంస్థ నిర్మాణానికి, ఆరోగ్య సంరక్షణ, జీవ శాస్త్రాలు, పరిశోధన, సాంకేతిక రంగాల్లో దాని లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి వినియోగించనున్నారు.

2025 ఆగస్టులో ప్రారంభమైన ఈ భాగస్వామ్యం ప్రస్తుతం రెండో దశలోకి ప్రవేశించింది. మూడు కీలక పరిశోధనా రంగాల్లో ఈ సహకారం కొనసాగనుంది.

కంప్యూటేషనల్‌ ఆంకాలజీ: ఎపిజెనోమిక్‌ బయోలాజికల్‌ క్లాక్‌లను ఉపయోగించి క్యాన్సర్‌ పురోగతిని అత్యంత కచ్చితత్వంతో గుర్తించడం, వ్యాధిని ముందస్తుగా గుర్తించేందుకు బయోమార్కర్లను కనుగొనడం, భారతీయ రోగులకు అనుగుణమైన నమూనాలను అభివృద్ధి చేయడం.

ఆరోగ్యకరమైన వృద్ధాప్యం: డిమెన్షియాతో జీవిస్తున్న వ్యక్తుల కోసం వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా రూపొందించిన డిజిటల్‌ కాగ్నిటివ్‌ స్టిమ్యులేషన్‌పై బృందం ప్రచురించిన పరిశోధన ఆధారంగా, వృద్ధుల కోసం కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత జ్ఞాపకశక్తి, అభిజ్ఞా సంరక్షణ విధానాలను అభివృద్ధి చేయడం.

మల్టీ-ఓమిక్స్‌, దీర్ఘాయుష్షు: జీవసంబంధమైన వయస్సును కొలిచేందుకు సమగ్ర ప్రమాణాన్ని రూపొందించడం, నివారణ వైద్య సంరక్షణకు మార్గనిర్దేశం చేసే వ్యక్తిగతీకరించిన ‘డిజిటల్‌ ట్విన్స్‌’ అభివృద్ధికి కృషి చేయడం.

ఈ భాగస్వామ్యం భారత్‌లో వైద్యపరంగా ప్రాధాన్యమున్న ప్రశ్నలను ప్రపంచ స్థాయి పరిశోధనతో అనుసంధానిస్తోంది. ఉత్తర అమెరికా, యూరప్‌, మధ్యప్రాచ్యం, ఆసియా-పసిఫిక్‌, ఆస్ట్రేలియాలోని ప్రముఖ సంస్థల నుంచి ఈ పరిశోధనపై ఆసక్తి పెరుగుతోంది. ఎస్‌బీఐ జపాన్ యొక్క ప్రముఖ విద్యా , పరిశోధనా సంస్థల నెట్‌వర్క్, విద్యా మార్పిడి, శిక్షణ, ఉమ్మడి పరిశోధన , గ్రాంట్ ప్రతిపాదనల వంటి అంశాలలో జీయూఎఫ్‌తో సహకారాన్ని కూడా అన్వేషిస్తుంది.

సంయుక్త పరిశోధనలకు మించి, పరిశోధన ప్రాధాన్యతలను నిర్ణయించడం, పీర్‌ రివ్యూడ్‌ పరిశోధనా ప్రచురణలు, విద్యా కార్యక్రమాలు, విజిటింగ్‌ ఫ్యాకల్టీ నియామకాల రూపకల్పనలోనూ ఎస్‌బీఐ, జీయూఎఫ్‌కు సహకరిస్తోంది. డాక్టర్‌ కంచెర్ల, డాక్టర్‌ కిటానో ఈ కార్యక్రమాలకు మొత్తం శాస్త్రీయ, వ్యూహాత్మక దిశానిర్దేశం చేస్తున్నారు. ఎస్‌బీఐ సీనియర్‌ పరిశోధకులు డాక్టర్‌ అయాకో యాచీ, డాక్టర్‌ సుచీంద్ర కె. పలనియప్పన్‌, డాక్టర్‌ సామిక్‌ ఘోష్‌, గిరి బృందంతో కలిసి పరిశోధనా కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తున్నారు.

ఈ భాగస్వామ్యంపై గ్లోబల్‌ యూనివర్సిటీ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, చైర్మన్‌ డాక్టర్‌ రవీంద్రనాథ్‌ కంచెర్ల మాట్లాడుతూ: “రోగుల జనాభాలో వైవిధ్యం, ఆరోగ్య సంరక్షణ అవసరాల విస్తృతి దృష్ట్యా ఆరోగ్య సంరక్షణ, జీవ శాస్త్రాలు, సాంకేతిక రంగాల్లో పరిశోధనను ముందుకు తీసుకెళ్లేందుకు భారత్‌ ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తోంది. గ్లోబల్‌ యూనివర్సిటీ ఫౌండేషన్‌ ద్వారా ప్రపంచ స్థాయి శాస్త్రీయ నైపుణ్యం, సాంకేతిక ఆవిష్కరణలు, భారతదేశ వైద్య రంగ వాస్తవ పరిస్థితులను ఒకచోట చేర్చాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. శాస్త్రీయ ఆవిష్కరణలను అర్థవంతమైన ఆరోగ్య ఫలితాలుగా మార్చేందుకు, ఆరోగ్య సమానత్వాన్ని పెంపొందించటానికి అవసరమైన పరిశోధనా సామర్థ్యాలను, విభిన్న రంగాల మధ్య సహకారాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ” అని అన్నారు.

సిస్టమ్స్‌ బయాలజీ ఇన్‌స్టిట్యూట్‌ అధ్యక్షుడు డాక్టర్‌ హిరోఆకి కిటానో మాట్లాడుతూ “క్యాన్సర్‌, అభిజ్ఞా సామర్థ్యం క్షీణించడం వంటి సంక్లిష్ట ఆరోగ్య సవాళ్ళను పరిష్కరించాలంటే అనేక జీవ వ్యవస్థలు పరస్పరం ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడంలో సిస్టమ్స్‌ బయాలజీ, కంప్యూటేషనల్‌ సైన్స్‌ శక్తిమంతమైన పరిష్కార మార్గాలను అందిస్తాయి. గ్లోబల్‌ యూనివర్సిటీ ఫౌండేషన్‌తో మా సహకారం వైద్యపరంగా ఎంతో ప్రాధాన్యమున్న రంగాల్లో పరిశోధనను ముందుకు తీసుకెళ్లడంతో పాటు భారత్‌లో శాస్త్రీయ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు అవకాశాన్ని కల్పిస్తోంది” అని అన్నారు.

సిస్టమ్స్‌ బయాలజీ ఇన్‌స్టిట్యూట్‌ గురించి
జపాన్‌కు చెందిన సిస్టమ్స్‌ బయాలజీ ఇన్‌స్టిట్యూట్‌ (ఎస్‌బీఐ) లాభాపేక్షలేని సంస్థ. సంక్లిష్టమైన బయోమెడికల్‌ సమస్యల పరిష్కారానికి సిస్టమ్స్‌ బయాలజీ, కంప్యూటేషనల్‌ సైన్స్‌, కృత్రిమ మేధ (ఏఐ)ను ఉపయోగిస్తూ పనిచేస్తోంది. నోబెల్‌ ట్యూరింగ్‌ ఛాలెంజ్‌ను ప్రతిపాదించిన అధ్యక్షుడు డాక్టర్‌ హిరోఆకి కిటానో నాయకత్వంలో ఈ సంస్థ పనిచేస్తోంది. ప్రధానమైన శాస్త్రీయ ఆవిష్కరణలు చేయగల ఏఐ వ్యవస్థలను అభివృద్ధి చేయడం ఈ ఛాలెంజ్‌ లక్ష్యం. యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిటిష్‌ కొలంబియా, మీలా – క్యూబెక్‌ ఏఐ ఇన్‌స్టిట్యూట్‌, ఇన్‌స్టిట్యూట్‌ క్యూరీ, యూనివర్సిటీ ఆఫ్‌ ఒసాకా, ఒకినావా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్‌ మెల్‌బోర్న్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ విద్యా, పరిశోధనా సంస్థలతో ఎస్‌బీఐ కలిసి పనిచేస్తోంది. సరిహద్దులకు అతీతంగా విభిన్న రంగాల పరిశోధనలు, శాస్త్రీయ సహకారాలను ప్రోత్సహిస్తోంది.

గ్లోబల్‌ యూనివర్సిటీ ఫౌండేషన్‌ (జీయూఎఫ్‌) గురించి
గిరి పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న లాభాపేక్షలేని సంస్థ, గ్లోబల్‌ యూనివర్సిటీ ఫౌండేషన్‌ (జీయూఎఫ్‌). ఆరోగ్య సంరక్షణ, జీవ శాస్త్రాలు, సాంకేతిక రంగాల సమ్మేళనంగా బహుళ విభాగాల పరిశోధన, ఆవిష్కరణల సంస్థను నిర్మిస్తోంది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ప్రణాళికలో ఆరు విద్యా సంస్థలు, ఏడు సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌, 1,200 పడకల సూపర్‌ స్పెషాలిటీ బోధన, పరిశోధనా ఆసుపత్రి, నైపుణ్యాభివృద్ధి కేంద్రం, ఇన్నోవేషన్‌ హబ్‌ ఉన్నాయి. పరిశోధన, విద్య, ఆవిష్కరణలను కేంద్రంగా చేసుకుని భారత్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఆరోగ్య సమానత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం దీని లక్ష్యం. (Story: సిస్టమ్స్‌ బయాలజీ ఇన్‌స్టిట్యూట్‌తో గ్లోబల్‌ యూనివర్సిటీ ఫౌండేషన్‌ భాగస్వామ్యం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments