Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌జగన్ అడ్డాలో పాగా వేస్తారా?

జగన్ అడ్డాలో పాగా వేస్తారా?

జగన్ అడ్డాలో పాగా వేస్తారా?

పులివెందుల, కడపపై కూటమి గురి

ఏకగ్రీవాలతో రాజకీయ సమీకరణాల్లో మార్పు

కూటమిలో పొత్తు ఓట్లపై అంతర్మథనం

తుపాన్ ప్రభావంలోనూ ప్రచార హోరు

ఎన్నికల వేళ పులివెందులకు జగన్ పర్యటనపై ఉత్కంఠ

ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం

న్యూస్‌తెలుగు/అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల పోరు కీలక దశకు చేరుకుంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడటంతో ఇక అందరి దృష్టి నవంబరు 1న జరిగే పోలింగ్‌పై కేంద్రీకృతమైంది. ముఖ్యంగా రాయలసీమ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు కలిగిన కడప జిల్లాలో ఈ ఎన్నికలు అధికార కూటమికి, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల మునన్సిపాల్టీ, కడప కార్పొరేషన్లలో టీడీపీతోపాటు కూటమి అభ్యర్థులు అత్యధికంగా ఏకగ్రీవాలు దక్కించుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ పరిణామాలతో జగన్ రాజకీయ ప్రాబల్యానికి కడప జిల్లాలో సవాలు ఎదురవుతోందన్న చర్చ మొదలైంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి రాలయసీమ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు, ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పులివెందుల, కడప, పుంగనూరు, రాయచోటి, రాజంపేట, తిరుపతి తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సందర్భంగా అధికార, ప్రతిపక్ష పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణలు జరిగాయి. పులివెందులలో పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడం, బాష్పవాయు గోళాలు ప్రయోగించడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. నామినేషన్లు వేయకుండా తమ అభ్యర్థులను అడ్డుకున్నారని వైఎస్సార్‌సీపీ ఆరోపించగా, కూటమి నేతలు ఈ ఆరోపణలను ఖండించారు. ఈ పరిణామాలు ఎన్నికల నిర్వహణ, శాంతిభద్రతలు, ప్రజాస్వామ్య ప్రక్రియపై చర్చకు దారితీశాయి. మాజీ సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాల్టీలో మొత్తం 40 వార్డులున్నాయి. వీటిలో 20 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 20 వార్డులకు నవంబరు 1న పోలింగ్ జరగనుంది. మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి కూడా ప్రత్యక్ష పోటీ నెలకొంది. వైఎస్సార్‌సీపీ తరఫున మాజీ చైర్‌పర్సన్ వైఎస్ ప్రమీలమ్మ బరిలో ఉండగా, టీడీపీ తరఫున తుగుట్ల గీత పోటీ చేస్తున్నారు. దీంతో పులివెందుల మున్సిపాల్టీలో మిగిలిన వార్డులతోపాటు చైర్‌పర్సన్ ఎన్నిక కూడా రెండు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. పులివెందులలో 20 వార్డులు ఏకగ్రీవం కావడం కూటమి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. మిగిలిన 20 వార్డుల్లో ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఏకగ్రీవమైన వార్డుల సంఖ్యతోనే మొత్తం మున్సిపల్ పాలకవర్గంపై స్పష్టమైన నిర్ణయానికి రావడానికి వీల్లేదు. చైర్‌పర్సన్ ఎన్నికతోపాటు మిగిలిన వార్డుల ఫలితాలు కూడా కీలకం కానున్నాయి. కడప కార్పొరేషన్ ఎన్నికలు మరో కీలక రాజకీయ సమరంగా మారాయి. మొత్తం 66 డివిజన్లున్న కార్పొరేషన్‌లో కూటమి అభ్యర్థులు 50 డివిజన్లను ఏకగ్రీవంగా దక్కించుకున్నట్లు తాజా ఎన్నికల వివరాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో టీడీపీకి 47, బీజేపీకి రెండు, జనసేనకు ఒక డివిజన్ దక్కినట్లు నివేదికలు పేర్కొన్నాయి. మిగిలిన 16 డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి. కడప మేయర్ పదవి కోసం టీడీపీ తరఫున ఎన్. సువర్ణ, వైఎస్సార్‌సీపీ తరఫున బండి దీప్తిరెడ్డి పోటీలో ఉన్నారు. కడప నగరానికి తొలి మహిళా మేయర్‌ను ఎన్నుకునే అవకాశం ఉండటంతో ఈ ఎన్నికకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవిరెడ్డి, టీడీపీ నేతలు కూటమి తరఫున ప్రచారాన్ని నిర్వహిస్తుండగా, వైఎస్సార్‌సీపీ తరఫున జిల్లా నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. కడపలో ఏకగ్రీవమైన డివిజన్ల సంఖ్య కూటమికి రాజకీయంగా బలాన్నిచ్చినా, మేయర్ పదవికి జరిగే పోటీ తుది రాజకీయ సమీకరణాలను నిర్ణయించనుంది.

ఉమ్మడి కడపలో ఏకగ్రీవాల ప్రభావం

కడప జిల్లాలోని ఇతర పట్టణ స్థానిక సంస్థల్లోనూ ఏకగ్రీవాల ప్రభావం కనిపించింది. ప్రొద్దుటూరులో 52 వార్డులకు గాను 51 స్థానాలను టీడీపీ, ఒక స్థానాన్ని బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా దక్కించుకున్నారు. బద్వేల్‌లో టీడీపీ, జనసేన అభ్యర్థులతోపాటు స్వతంత్రులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కమలాపురంలో 23 వార్డులకు 22 టీడీపీకి, ఒకటి బీజేపీకి దక్కాయి. ఎర్రగుంట్లలోనూ టీడీపీ, బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవ విజయాలు సాధించారు. మైదుకూరులో 32 వార్డులకు గాను 17 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. రాజంపేటలోనూ కూటమి అభ్యర్థులు పలు వార్డులను ఏకగ్రీవంగా దక్కించుకున్నారు. జిల్లాలోని తొమ్మిది పట్టణ స్థానిక సంస్థల్లో ఏడు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి ఏకగ్రీవంగా చైర్‌పర్సన్ పదవులను దక్కించుకున్నాయి. పులివెందుల మున్సిపాల్టీ, కడప మేయర్ చైర్‌పర్సన్, మరికొన్ని వార్డులకు, డివిజన్లకు పోటీ కొనసాగుతోంది. ఈ పరిణామాలు కడప జిల్లాలో స్థానిక రాజకీయ సమీకరణాల్లో మార్పులకు దారితీస్తున్నాయి. నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ పులివెందుల పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. గతంలో పులివెందుల పర్యటన సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులతో సమావేశమై, ఘర్షణల్లో గాయపడిన కార్యకర్తలను పరామర్శించారు. నామినేషన్లు వేయలేకపోయిన అభ్యర్థులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రతి కార్యకర్తపై పడే దెబ్బ తనపై పడినట్లేనని వ్యాఖ్యానించారు. పులివెందుల నుంచే టీడీపీ హింసను ఎదుర్కొందామంటూ జగన్ తన చేతికి ఉన్న షర్టు మడతను చూపిస్తూ సవాల్ విసిరారు. ఎన్నికల రోజున పులివెందులకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటానని ప్రకటించారు. జగన్ పర్యటన వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో రాజకీయ ఉత్సాహాన్ని పెంచే అంశంగా మారగా, ఆయన పర్యటన సమయంలో భద్రతా ఏర్పాట్లు ఎలా ఉంటాయన్న చర్చ కూడా కొనసాగుతోంది. పులివెందులలో ఏకగ్రీవాల నేపథ్యంలో జగన్ స్వయంగా ఓటు వేయడానికి రావడం, మిగిలిన వార్డుల ఎన్నికల ప్రచారంలో పార్టీ శ్రేణులకు అండగా నిలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగించాయి. పులివెందులలో నామినేషన్ల సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. బాష్పవాయు గోళాలు ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇతర ప్రాంతాల్లోనూ దాడులు, తోపులాటలు, నామినేషన్ పత్రాలు చించివేయడం, అభ్యర్థులను అడ్డుకోవడం వంటి ఆరోపణలు వెలువడ్డాయి. పోలీసులు, అధికార యంత్రాంగం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించగా, శాంతిభద్రతలను కాపాడేందుకే పోలీసులు చర్యలు తీసుకున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నామినేషన్ల ప్రక్రియలో అభ్యర్థులకు ఆటంకాలు ఎదురయ్యాయన్న ఫిర్యాదులపై సుప్రీంకోర్టు అక్టోబరు 21న ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కడప కార్పొరేషన్, రాజంపేట, మైదుకూరు, తిరుపతి స్థానిక సంస్థల్లో అదనంగా నామినేషన్లు స్వీకరించేందుకు అవకాశం కల్పించింది. ఈ పరిణామం ఎన్నికల ప్రక్రియలో మరో కీలక మలుపుగా నిలిచింది.

కూటమిలో పొత్తు ధర్మంపై ప్రశ్నలు

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో సీట్ల సర్దుబాటు అన్ని చోట్లా సజావుగా సాగలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఒకే వార్డు లేదా డివిజన్‌లో కూటమి భాగస్వామ్య పక్షాల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో పరస్పర పోటీ అనివార్యమైంది. మరికొన్ని చోట్ల జనసేన అభ్యర్థులకు టీడీపీ శ్రేణుల నుంచి అభ్యంతరాలు, ఘర్షణలు ఎదురైనట్లు ఆరోపణలు వచ్చాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ స్థాయిలో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగినప్పటికీ, స్థానిక స్థాయిలో ఆశావహుల ఒత్తిళ్లు, రాజకీయ ఆధిపత్య పోరు కారణంగా కొన్ని చోట్ల సమన్వయం లోపించింది. విశాఖపట్నం, విజయవాడ, ఏలూరు, గుంటూరు వంటి ప్రధాన నగరాల్లోనూ కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య పోటీ కనిపించింది. కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైన స్థానాల్లో లభించిన రాజకీయ ప్రయోజనం ఒకవైపు ఉండగా, నేరుగా పోటీ ఉన్న స్థానాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఓట్లు పరస్పరం ఎలా ప్రభావితం చేస్తాయన్నది మరో ప్రశ్నగా మారింది. స్థానిక స్థాయిలో పార్టీ శ్రేణులు ఎవరికి మద్దతు ఇస్తాయన్నది ఫలితాలపై ప్రభావం చూపే అంశంగా మారింది.
తుపాన్ ప్రభావిత జిల్లాల్లోను ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం ప్రత్యేకంగా సమీక్షించింది. తుపాన్ కారణంగా కొన్ని ప్రాంతాల్లో ప్రచారం, రవాణా, సాధారణ జనజీవనానికి అంతరాయాలు ఏర్పడినప్పటికీ, మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ను నవంబరు 1న యథావిధిగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో (ఏకగ్రీవాలు మినహాయించి) నవంబరు 1న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అవసరమైతే నవంబరు 2న రీపోలింగ్ నిర్వహిస్తారు. నవంబరు 3న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. మున్సిపల్ ఎన్నికలతోపాటు జరుగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ను మాత్రం నవంబరు 5కు వాయిదా వేశారు.
ఈ స్థానిక సమరంలో ఏకగ్రీవాలతో కూటమి కొన్ని పట్టణ స్థానిక సంస్థల్లో ముందంజలో కనిపిస్తున్నప్పటికీ, మిగిలిన వార్డుల్లో జరిగే పోలింగ్ ఫలితాలు, మేయర్, చైర్‌పర్సన్ పదవుల పోటీ తుది రాజకీయ చిత్రాన్ని స్పష్టం చేయనున్నాయి. జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో వైఎస్సార్‌సీపీ తన పట్టును నిలుపుకుంటుందా? కడప నగరపాలక సంస్థలో తొలిసారి మేయర్ పదవిని టీడీపీ దక్కించుకుంటుందా? కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య ఓట్ల బదిలీ ఎంతవరకు జరుగుతుంది? అన్న ప్రశ్లకు ఫలితాలే సమాధానం చెప్పనున్నాయి. (Story: జగన్ అడ్డాలో పాగా వేస్తారా?)

Top Stories You Can See

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments