వినుకొండ మున్సిపాలిటీలో మరో 4 కొత్త వార్డులు…
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ పురపాలక సంఘంలో అదనంగా మరో నాలుగు కొత్త వార్డులు ఏర్పాటు కానున్నాయి. జీవో 64 ప్రకారం ప్రస్తుతం ఉన్న 32 వార్డులకు అదనంగా మరో 4 చేరితే, మొత్తం వార్డుల సంఖ్య 36కు చేరుతుందని మున్సిపల్ కమిషనర్ కె. శివరామ్ ప్రసాద్ వెల్లడించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వార్డుల పునర్విభజన ప్రక్రియను ప్రారంభించినట్లు ఆయన ఒక మీడియా సమావేశంలో తెలిపారు. ఏప్రిల్ 2న ప్రారంభమైన ఈ పునర్విభజన ప్రక్రియపై ప్రజలు తమ సలహాలు, సూచనలు లేదా అభ్యంతరాలను ఏప్రిల్ 9వ తేదీ వరకు తెలియజేయవచ్చన్నారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం నివేదికలను కలెక్టర్‌కు పంపి, ఏప్రిల్ 26వ తేదీలోపు వార్డుల పెంపు ప్రక్రియను పూర్తిగా ముగిస్తారు. 2011 జనాభా లెక్కలు, వార్డుల వారీగా ఓటర్లు, సామాజిక వర్గాల ఆధారంగా ఈ విభజన జరగనుంది.
ఆస్తిపన్ను వసూళ్లలో వినుకొండ మున్సిపాలిటీ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని కమిషనర్ ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. అలాగే, ప్రస్తుతం జరుగుతున్న కులగణన, జనగణన కార్యక్రమాలకు పట్టణ ప్రజలు సిబ్బందికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.(Story : వినుకొండ మున్సిపాలిటీలో మరో 4 కొత్త వార్డులు… )

