రాష్ట్రవ్యాప్తంగా పండుగలా పెన్షన్ల పంపిణీ: అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం…. మక్కెన..
ఒక్కరోజే రూ. 2,700 కోట్ల పంపిణీ…..
నియోజకవర్గంలో రూ. 17.84 కోట్లు, మున్సిపాలిటీలో రూ. 2.34 కోట్లు అందజేసిన వైనం…..
న్యూస్ తెలుగు/వినుకొండ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. పేదల సంక్షేమమే లక్ష్యంగా, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని జిడిసిసిబి చైర్మన్, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లిఖార్జునరావు కొనియాడారు. పట్టణంలో పలు వార్డుల్లో మక్కెన చేతుల మీదగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 62 లక్షల మంది లబ్ధిదారులకు ఈ ఒక్క రోజే సుమారు రూ. 2,700 కోట్ల రూపాయలను ప్రభుత్వం పంపిణీ చేసింది. సాధారణ పెన్షన్‌ను రూ. 3,000 నుంచి రూ. 4,000 లకు, అలాగే వికలాంగుల పెన్షన్‌ను రూ. 3,000 నుంచి ఏకంగా రూ. 6,000 లకు పెంచి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకుందని నాయకులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు నేతృత్వంలో నియోజకవర్గ వ్యాప్తంగా 40,330 మంది లబ్ధిదారులకు రూ. 17 కోట్ల 84 లక్షల రూపాయలను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. అలాగే కేవలం మున్సిపాలిటీ పరిధిలోనే 5,268 మందికి రూ. 2 కోట్ల 34 లక్షల రూపాయలను అందజేశారు. సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తోందని వక్తలు గుర్తుచేశారు. ఒక పక్క రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తూనే.. మరోపక్క ‘సూపర్ సిక్స్’ పథకాలను అమలు చేస్తున్నారని ప్రశంసించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీతో పాటు, కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా తలా రూ. 15,000 చొప్పున సాయం అందించే కార్యక్రమాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. పేదల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి, స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుకి నాయకులు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె. శివరామ ప్రసాద్, మాజీ చైర్మన్, పార్టీ క్లస్టర్ ఇంచార్జి పూర్ణ, పట్టణ పార్టీ అధ్యక్షులు రోశయ్య, స్థానిక నాయకులు దాసయ్య, జానీ, తదితర కౌన్సిలర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.(Story : రాష్ట్రవ్యాప్తంగా పండుగలా పెన్షన్ల పంపిణీ: అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం…. మక్కెన.. )

