ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు పడేవిధంగా అధికారులు కృషి చేయాలి
న్యూస్ తెలుగు/వనపర్తి : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు పడేవిధంగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఆత్మకూరు మండలంలోని బాల కిష్టాపూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు.ఇళ్ల నిర్మాణ పనులు సకాలంలో లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. లబ్ధిదారుల ఖాతాల్లో నిర్మాణ బిల్లులు సమయానికి జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండలంలోని అన్ని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ ఆత్మకూరు పట్టణంలోని ఉచిత డయాలిసిస్ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి అందుతున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు. ముందుగా దూర ప్రాంతాలకు వెళ్లి చికిత్స పొందాల్సి వచ్చేదని, ప్రస్తుతం స్థానికంగా డయాలిసిస్ సౌకర్యం అందుబాటులో ఉండటం చాలా సౌకర్యంగా మారిందని రోగులు కలెక్టర్ కు తెలియజేశారు. రోగులకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని, ముఖ్యంగా మరుగుదొడ్డి (టాయిలెట్) సౌకర్యం కల్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. హౌసింగ్ పీడీ విఠోబా, తహసిల్దార్ జె కే మోహన్, ఎంపీడీవో, ఆర్ఎంఓ డాక్టర్ చైతన్య గౌడ్, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.(Story : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు పడేవిధంగా అధికారులు కృషి చేయాలి )
