దేశాభివృద్ధికి ఎంతో కీలకమైన జనాభా గణన
న్యూస్ తెలుగు/వనపర్తి : దేశాభివృద్ధిలో ఎంతో కీలకమైన జనాభా గణన దాదాపు 15 సంవత్సరాల తర్వాత చేపట్టడం జరుగుతుందని, ఇంతటి ముఖ్యమైన జనాభా గణన లో పొరపాట్లకు తావు ఇవ్వకుండా పకడ్బందీగా చేసేందుకు జిల్లా సెన్సస్ ఛార్జ్ అధికారులది ముఖ్య భూమిక ఉంటుందని అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఎన్. ఖీమ్య నాయక్ సూచించారు. వనపర్తి ఐ డి ఓ సి సమావేశ మందిరంలో మార్చి 15 నుండి 17వ తేదీ వరకు జిల్లా సెన్సస్ చార్జి అధికారులకు నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో మంగళవారం అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రెండు విడుదలగా జనాభా గణన జరుగుతుందని ఇందులో భాగంగా మొదటి విడత మే 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. రెండో విడత 2027 ఫిబ్రవరి నెలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.తొలిసారి డిజిటల్ విధానంలో జనాభా గణన భారతదేశ చరిత్రలో తొలిసారిగా దేశ జనాభా గణనను తప్పులు లేకుండా పకడ్బందీగా ఉండేందుకు డిజిటల్ పద్ధతిలో నిర్వహించడం జరుగుతుందన్నారు. తొలి విడత జనాభా గణన ప్రారంభం కాక ముందు 15 రోజుల నుండి అంటే ఏప్రిల్ 26 నుండి మే, 10 వ తేది అర్ధరాత్రి వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించడం జరిగిందన్నారు. ఏప్రిల్ 26 నుండి 24/7 పనిచేసే ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియలో యజమాని తన స్వంత మొబైల్ లో లేదా కంప్యూటర్ లో sc.census.gov.in లో లాగిన్ అయి ఎన్యూమరేషన్ చేసుకోవచ్చని తెలిపారు. 16 భాషల్లో రూపొందించిన ఈ (హెచ్.ఎల్. ఒ) పోర్టల్ ద్వారా యజమాని స్వంతంగా తన ఇంటి వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు, ఆస్తులు తదితర అన్ని అంశాలను ఆన్లైన్ ద్వారా పూర్తి చేసుకోవచ్చు. ఇంటి యజమాని చేసుకున్న స్వంత ఎన్యూమరేషన్ ఒక ప్రత్యేక సైట్ లో నిక్షిప్తమై ఉంటుందని, మే, 11 నుండి ప్రారంభం అయ్యే జనాభా గణనలో జనాభా గణన చేసే అధికారి ఆ ఇంటికి వెళ్లి అడిగినప్పుడు తాను స్వంతంగా ఎన్యూమరేషన్ చేసుకున్నాను అని తెలిపినప్పుడు ప్రత్యేకంగా నమోదు అయిన ఐ.డి ను తిరిగి తెరిచి అన్ని సరిచూసుకుని ఫైనల్ సబ్మిట్ చేసినప్పుడు మాత్రమే వివరాలు సర్వర్ లో శాశ్వతంగా నిక్షిప్తం అయిపోయాయని తెలిపారు. జిల్లా ప్రజలు ఈ స్వంత ఎన్యూమరేషన్ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జడ్పీ సి. ఈ. ఒ యాదయ్య, సి.పి. ఒ హరికృష్ణ, డి.పి. ఒ రఘునాథ్ రెడ్డి, ఎ.డి. మత్స్య శాఖ లక్ష్మప్ప, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు తదితరులు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.(Story : దేశాభివృద్ధికి ఎంతో కీలకమైన జనాభా గణన )
