కొత్త ఏడాదిలో పోరాటాలను ఉదృతం చేయాలి
న్యూస్ తెలుగు/వనపర్తి : నూతన సంవత్సరంలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పోరాటాలను ఉధృతం చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఇన్చార్జ్ రమేష్ పిలుపునిచ్చారు. గురువారం వనపర్తి సిపిఐ ఆఫీసులో ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి వంశీ, విద్యార్థులతో కలిసి నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. నేతలుకేకులు కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. విద్యార్థులకు పంపిణీ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. జిల్లావిద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉందన్నారు. ఈ ఏడాది బకాయిలు పూర్తిగా చెల్లించేందుకు పోరాడాలి అన్నారు. పాఠశాలలు కళాశాలలో టీచర్లు, అధ్యాపకులు, భవనాలు, ప్రయోగశాలల కొరత ఉందని తీర్చేందుకు ఉద్యమించాలన్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల కొరత ఉందని తీర్చాలన్నారు. వసతులు లేని అద్దె భవనాలలో సంక్షేమ హాస్టల్లో నిర్వహిస్తున్నారని, స్నానాల గదులు మరుగుదొడ్లు, సరైన నీటి వసతి లేక ఇబ్బందులు పడుతున్నారని పరిష్కారానికి ఒత్తిడి పెంచాలన్నారు. అన్ని హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు సకాలంలో చెల్లించేందుకు కృషి చేయాలన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య,వసతులను పెంచేందుకు పోరాడాలని నూతన సంవత్సరంలో ఏఐఎస్ఎఫ్ దీక్ష తీసుకోవాలని కోరారు. చదువుతోపాటు సమస్యలపై పోరాడేందుకు విద్యార్థుల్లో చైతన్యం నింపాలన్నారు. ఎన్ఎఫ్ఐ డబ్ల్యు నాయకురాలు శిరీష, జ్యోతి, రూప ఏఐఎస్ఎఫ్ నేతలు విజయ్, ప్రకాష్, ఇమ్రాన్, లావణ్య, వెంకటేష్ విద్యార్థులు పాల్గొన్నారు.(Story : కొత్త ఏడాదిలో పోరాటాలను ఉదృతం చేయాలి)

