కొచ్చెర్లలో వరి పొలాలను పరిశీలించిన
ఎకరాకు రూ.10 వేల సాయంతో పాటు పంట సంరక్షణకు శాస్త్రీయ సూచనలు…
న్యూస్ తెలుగు/వినుకొండ : మొంథా తుపాను కారణంగా పంటలు నష్టపోయిన రైతన్నలకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు భరోసా ఇచ్చారు. తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పొలాలను, రోడ్ల నష్టాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ క్లిష్ట సమయంలో రైతులు ధైర్యంగా ఉండాలని, నష్టపోయిన ప్రతి రైతును ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక యాప్ ద్వారా వివరాలు నమోదు చేయాలని ఆదేశించారని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
*క్షేత్రస్థాయి పర్యవేక్షణ, నష్టం అంచనా….
మొంథా తుపాను ప్రభావంతో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి జీవీ ఆంజనేయులు ఈపూరు మండలం కొచ్చర్లలో నేలకొరిగిన వరి పొలాలను పరిశీలించారు. ఈ పర్యటనలో ఆయన వెంట ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయం నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు శ్రీనివాసరావు, నగేష్ కూడా ఉన్నారు. ఈదురు గాలుల ప్రభావంతో వరి చేలు నేలకొరిగినట్లు గుర్తించారు. కీలక దశలో పంట దెబ్బతినడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం తప్పదని రైతులు ఆయన వద్ద ఆందోళన వ్యక్తం చేయగా, ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి హామీ ఇచ్చారు. తుపాను కారణంగా రాష్ట్రంలో మొత్తం 1,825 గ్రామాల్లో 87 వేల హెక్టార్లలో వరి, పత్తి, మొక్కజొన్న, మిరప, పొగాకు, కంది పంటలకు నష్టం వాటిల్లిందని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో 50 వేలకుపైగా ఎకరాల్లో పంట నష్టం జరిగింది, ఇది చాలా బాధాకరమని పేర్కొన్నారు.
*శాస్త్రీయ పద్ధతులతో తక్షణ రక్షణ: ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం సహకారం:….
ప్రస్తుత సంక్షోభ సమయంలో రైతులు కేవలం నష్టపరిహారం కోసం ఎదురు చూడకుండా, మిగిలిన పంటను రక్షించుకునేందుకు వీలుగా జీవీ ఆంజనేయులు వెంటనే ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలను కొచ్చర్లకు తీసుకువచ్చారు. శాస్త్రవేత్తలు శ్రీనివాసరావు, నగేష్ వరి పంట సంరక్షణకు పలు అత్యంత కీలకమైన సూచనలు చేశారు.
*శాస్త్రవేత్తల తక్షణ సూచనలు:….
గింజ రంగు మారకుండా: పాలు పోసుకునే దశలో కిందపడిన వరి పంటకు తక్షణమే ‘టిట్’ అనే మందును పిచికారీ చేయాలని సూచించారు. దీనిని ఎకరానికి 200 మి.లీ.ల చొప్పున పిచికారీ చేయడం వల్ల గింజ రంగు మారకుండా ఉండటంతో పాటు, మానిపండు తెగులు గానీ, పొడ తెగులు గానీ రాకుండా ఉంటుందని తెలిపారు. అగ్గి తెగులు నివారణ: మళ్లీ వారం రోజుల తర్వాత అగ్గి తెగులు సోకే అవకాశం ఉంటుందని, మచ్చలు కనిపించిన తర్వాత మాత్రమే ‘భీమ్’ అనే మందును ఎకరానికి 120 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలని, మచ్చలు కనిపించకపోతే పిచికారీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పంటకు పోషకాలు: పొట్ట దశలో ఉండి, నిలబడిన వరి పొలాల్లో నీటిని బయటకు విడిచి పెట్టిన తర్వాత, ఎకరానికి 25 కిలోల యూరియా, 15-20 కిలోల పొటాషియం వేసుకోవాలని సూచించారు.
*రైతులకు పూర్తి భరోసా: ఈ-క్రాప్ నమోదుపై ప్రత్యేక ప్రకటన:…..
తుపాను కారణంగా ఈ-క్రాప్ నమోదు ప్రక్రియ పెండింగ్‌లో ఉన్న రైతులు ఆందోళన చెందవద్దని జీవీ ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు. కేవలం 5 నుంచి 10 శాతం మంది రైతులది మాత్రమే నమోదు పెండింగ్‌లో ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ప్రతి రైతుది ఈ-క్రాప్ నమోదు చేసి ఆదుకుంటామని, ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. వరి పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున సాయం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. తుపాను కారణంగా పంచాయతీరాజ్ రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టులు దెబ్బతినడంతో సుమారు రూ.2,500 కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు. ముఖ్యంగా మగుండ్లకమ్మ వాగు పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున నష్టం జరిగి, రోడ్లు తెగిపోయి రవాణా స్తంభించిపోయిందని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు హుటాహుటినా సంఘటనా స్థలాలకు చేరుకుని యుద్ధప్రాతిపదికన రోడ్లకు మరమ్మతులు చేపడుతున్నారని, ప్రజల రాకపోకలకు అంతరాయం లేకుండా చేయాలనే సంకల్పంతో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా క్షేత్రస్థాయిలోనే ఉన్నారని జీవీ ఆంజనేయులు వివరించారు.తుపాన్లను ఎవరూ ఆపలేరు గానీ ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ప్రాణనష్టం జరగకుండా చూశామని, అదే విధంగా పంట నష్టాన్ని కూడా చాలావరకు నివారించగలిగామని ఆయన పేర్కొన్నారు. విపత్తు సమయంలో కూటమి నాయకులు కూడా బాధితులను ఆదుకుంటున్నారని ఆయన కొనియాడారు. రైతులు ధైర్యంగా ఉండాలని, జరిగిన నష్టాన్ని ప్రభుత్వం భర్తీ చేస్తుందని జీవీ ఆంజనేయులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.(Story : కొచ్చెర్లలో వరి పొలాలను పరిశీలించిన )

