మొంథా తుపాను సహాయ కార్యక్రమాల్లో
న్యూస్ తెలుగు/వినుకొండ : మొంథా తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విస్తృతంగా పర్యటించారు. పునరావాస కేంద్రాలు, లోతట్టు ప్రాంతాలు, కాలనీల్లో పర్యటించి బాధితులకు అందుతున్న సహాయ కార్యక్రమాలను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. అధికారు మధ్య సమన్వయ లోపం లేకుండా చూడాలని, వరద సహాయ కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని జీవీ హెచ్చరించారు. తుపాను బాధితుల కోసం వినుకొండ నిర్మల పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పరిశీలించారు. పునరావాస కేంద్రంలోని ఏర్పాట్లపై తుపాను బాధితులను అడిగి తెలుసుకున్నారు. వసతి పొందుతున్న ప్రజలతో మాట్లాడి ఆహారం, సౌకర్యాలపై ఆరా తీశారు. పునరావాస కేంద్రంలో ఆహారం, తాగునీరు, మందులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని బాధితులకు ధైర్యం చెప్పారు.
*తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన
మొంథా తుపాను ప్రభావంతో వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి పంచాయతీ పరిధిలో నీటమునిగిన అరుంధతి కాలనీ, రజక కాలనీని చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పరిశీలించారు. బాధితులను వినుకొండ నిర్మల పాఠశాలలోని పునరావాస కేంద్రానికి తరలించారు. నీటమునిగే ప్రాంతాలను గుర్తించి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు తక్షణమే అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని, పునరావాసం కల్పించాలని అధికారులను ఆదేశించారు.
*మొంథాను సమర్థంగా ఎదుర్కొంటాం
మొంథా తుపాన్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తుపాను రాష్ట్రంలో అనేక ఇబ్బందులు సృష్టిందని, ప్రభుత్వం ఎంతో అప్రమత్తంగా ఉండటంతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా నివారించగలిగామన్నారు. సీఎం చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేష్ సచివాలయంలోనే ఉండి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారన్నారు. ఆర్టీజీ సెంటర్‌కు వచ్చిన సమాచారాన్ని విశ్లేషించి రియల్ టైమ్‌లో సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. ముందస్తు చర్యలు చేపట్టడం వల్లే ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా నివారించగలిగామన్నారు. ప్రజాప్రతినిధులతో పాటు అన్నిశాఖల అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు భరోసా ఇచ్చేలా పనిచేస్తున్నామని చెప్పారు. అధికారుల అప్రమత్తతతో లోతట్టు ప్రాంతాల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా కాపాడుకోగలిగామని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ ఉపకేంద్రాలతో పాటు ట్రాన్స్‌ఫార్మర్లలో కూడా సమస్యలు తలెత్తాయని, యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కూలిన విద్యుత్ స్తంభాలను యుద్ధప్రాతిపదికన తొలగించి సరఫరా పునరుద్ధరించేందుకు ట్రాక్టర్లు, జేసీబీ యంత్రాలు, ఇతర సామగ్రిని సిద్ధం చేశారన్నారు. రోడ్లపై కూలిన వృక్షాలను కూడా తొలగించడం జరుగుతుందన్నారు. త్వరితగతిన సమస్యలను పరిష్కరించి సాధారణ స్థితికి తెచ్చేలా అధికార యంత్రాంగం మొత్తం కష్టపడి పనిచేస్తుందన్నారు.
*తుపాను బాధితులతో పాటు అన్నదాతలకు అండగా ఉంటా
తుపాను ప్రభావంతో పలుచోట్ల గుడిసెలు, మట్టిమిద్దెలు కూలిపోయాయని, వారందరిని ఎన్డీఏ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. నష్టపోయిన వారందరికీ పక్కా ఇళ్లు మంజూరు చేసి భవిష్యత్తులో వారంతా సంతోషంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. తుపాను కారణంగా రైతులు కూడా నష్టపోయారని, వరి, మొక్కజొన్న, మిర్చి, పత్తి, పొగాకు, కంది సాగుచేసిన రైతులు నష్టపోయారని, వారిని కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. నష్టపోయిన రైతుల పంటల వివరాలను సర్వేల ఆధారంగా అధికారులు నమోదు చేయాలని, ఎంత విస్తీర్ణంలో నష్టపోయారు, ఎంతమేర నష్టం జరిగిందో నమోదు చేయాలని ఇప్పటికే వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించామన్నారు. శివశక్తి ఫౌండేషన్ ద్వారా 200 కుటుంబాలకు దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేయడంతో పాటు ఆ కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు.డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు కూటమి నాయకులు,అధికారులు పాల్గొన్నారు.(Story : మొంథా తుపాను సహాయ కార్యక్రమాల్లో )

