ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం
ప్రజా దర్బార్ కు వినతుల వెల్లువ
న్యూస్ తెలుగు/వినుకొండ : ప్రజలకు సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ నియోజకవర్గ ప్రజల కోసం చీఫ్ విప్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కు ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గం నలుమూలల నుండి ప్రజలు ప్రజా దర్బార్ కు హాజరై వారి సమస్యలను చీఫ్ విప్ జీవి ఆంజనేయులుకు విన్నవించుకున్నారు. ప్రతి ఒక్కరి సమస్యను అధికారులతో చర్చించి పరిష్కార మార్గం చూపుతానని చీఫ్ విప్ జీవి పేర్కొన్నారు. వినుకొండ పట్టణంతో పాటు గ్రామాల్లో సిసి రోడ్లు, విద్యుత్తు డ్రైన్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి వివిధ వర్గాల ప్రజలు విన్నవించారు. ఫిర్యాదులను పరిశీలించిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పోలీసుల వల్ల తమకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని వినుకొండ పట్టణంలో తోపుడు బండ్ల వ్యాపారులు చీఫ్ విప్ జీవిని విన్నవించారు. టౌన్ సిఐ తో మాట్లాడిన అనంతరం ట్రాఫిక్కుకు ఇబ్బంది కలిగించకుండా వ్యాపారం చేసుకోవాలని, తోపుడు బండ్లు లేని వారు ఉంటే శివశక్తి ఫౌండేషన్ నుండి బండ్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. కూటమి పాలనలో ప్రజలందరికీ సమన్యాయం జరుగుతుందని వివరించారు. సంక్షేమం అభివృద్ధి సమాంతరంగా నిర్వహిస్తూ ప్రజా ప్రభుత్వం గా ప్రజల మన్ననలు పొందిందన్నారు.(Story : ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం )

