స్త్రీ శక్తితో కుదేలవుతున్న వినుకొండ ఆర్టిసి
* రెండు ప్రధాన ద్వారాల వద్ద కంకర లేచిపోయి బయటపడుతున్న ఇనుప రాడ్లు
* దెబ్బ తింటున్న బస్సు టైర్లు, గాయాల పాలవుతున్న ప్రయాణికులు
న్యూస్ తెలుగు / వినుకొండ : అసలే ఆర్టీసీ నష్టాలు, ఎప్పటికప్పుడు ఆ నష్టాలను అధిగమించేందుకు ఆర్టీసీ అధికారులు ఆపసోపాలు పడుతుంటారు. ఇక మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం పెట్టడంతో ఇక ప్రయాణికులకు బస్సులు సరిపడక, స్త్రీ శక్తి దెబ్బకు అధికారులు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. దీంతో బస్టాండ్ లో ప్రయాణికులకు కనీస అవసరాలు తీర్చలేక అధికారులు చేతులు పైకి ఎత్తేస్తున్నారు. మెయింటెనెన్స్ కు ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలన్న ఇంజనీరింగ్ అధికారుల అనుమతి పొందాల్సి ఉంటుంది. దీనికోసం రోజుల తరబడి ఉండాల్సి వస్తుంది. దీంతో బస్టాండ్ లో పలు మరమ్మతులకు నోచుకోక ప్రయాణికులు, బస్సులు దెబ్బతింటున్నాయి. బస్టాండు 2 ప్రధాన ద్వారాల వద్ద రోడ్డుపై కాంక్రీట్ పెచ్చులు లేచిపోయి ఇనప రాడ్లు పైకి కనిపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు బస్టాండ్ లోకి రావాలన్నా, పోవాలన్న ఇబ్బందులు పడుతుండగా, కొందరి చెప్పులు ఇనుప రాడ్లకు తట్టుకొని బొక్క బార్ల పడుతుండగా, బస్సు టైర్లు ఆ ఇనుప రాడ్ల పై నుండి వెళ్ళటంతో టైర్లు కూడా దెబ్బతింటున్నాయని కొందరు డ్రైవర్లు వాపోతున్నారు. ఇక మూత్రశాల వద్ద బస్సులు నిలపడంతో ముక్కు మూతి మూసుకొని పోయే పరిస్థితి దాపరించింది. అధికారులకు ఎన్నో మార్లు చెప్పిన శాశ్వత పరిష్కారం చేయడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. అలాగే కాంట్రాక్టు, టాయిలెట్స్ వద్ద డబ్బులు గుంజుతున్నారే గాని, టాయిలెట్స్ శుభ్రంగా ఉంచడం లేదని ప్రయాణికులు విమర్శిస్తున్నారు. వీటన్నింటిపై అధికారులు దృష్టి పెట్టి తక్షణం ఆ సమస్యలు పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
స్త్రీ శక్తి పథకం స్త్రీలకు ఆర్థిక భారం చాలా తగ్గించింది

బస్టాండ్ లో సమస్యలు పరిష్కరిస్తాం…. డిపో మేనేజర్ జె నాగేశ్వరరావు ను. సమస్యలపై వివరణ కోరగా. టాయిలెట్స్ వద్ద ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేందుకు వ్యక్తులను ఏర్పాటు చేశామని, నీరు సరఫరా కూడా పూర్తిస్థాయిలో చేస్తున్నామని, తమ పర్యవేక్షణ గంట గంటకు ఉంటున్నదని అన్నారు. ఇక బస్టాండు ప్రధాన ద్వారాలు వద్ద రోడ్డు చెడిపోయిన మాట వాస్తవమేనని, పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసేందుకు ఇంజనీరింగ్ అధికారుల అనుమతి పొందాల్సి ఉంటుందని, దీనిపై లెటర్ వ్రాస్తామని, ఈలోగా తాత్కాలిక మరమ్మతులు చేపడతామన్నారు. ఇక బస్సుల్లో ఫ్రీ సర్వీసు స్త్రీ శక్తి పథకం సామాన్య కుటుంబాలకు ఎంతో సౌకర్యం, లాభంగా ఉందన్నారు. కాగా ఫ్రీ సర్వీసు పెట్టక ముందు డిపో ఆదాయం ప్రతిరోజు 15 నుండి 18 లక్షల రూపాయలు వరకు ఉండేదని. నేడు 7 నుండి 8 లక్షల వరకు మాత్రమే వస్తుందన్నారు. కాగా ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం ద్వారా సెప్టెంబర్ 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు 37 రోజుల్లో 7 లక్షల 35 వేలు 719 మందిని బస్సుల్లో ఉచితంగా చేరవేసినట్లు తెలిపారు. అలాగే ఇప్పటివరకు 3 కోట్ల 6 లక్షల 46వేల 433 రూపాయలు డిపో ఆదాయం కోల్పోయిందన్నారు. డిపోలో 61 ఆర్టిసి బస్సులు, 38 హయర్ బస్సులు నడుస్తున్నాయని, ఫ్రీ సర్వీసులకు సుమారు 80 బస్సులు తిప్పుతున్నామన్నారు. కాగా ఆర్టీసీ కార్గో పార్సెల్ సర్వీస్ కు ప్రజల నుండి వ్యాపార వర్గాల నుండి మంచి స్పందన లభిస్తుందని, కార్గో పార్సెల్ సర్వీసును అన్ని వర్గాల ప్రజలు బాగా ఆదరిస్తున్నారన్నారు. అలాగే పార్సెల్సు ఆరు బయట ఉంచకుండా ఎండకు, వానకు దెబ్బతినకుండా గదులలో రాక్స్ ఏర్పాటు చేశామన్నారు. ఇక స్త్రీ శక్తి పథకాన్ని కారులున్న కుటుంబాలు కూడా బస్టాండ్ వరకు కారులో చేరుకొని ఫ్రీ బస్సులు ఎక్కి వెళ్ళిపోవటం ఎక్కువగానే ఉందన్నారు.(Story:స్త్రీ శక్తితో కుదేలవుతున్న వినుకొండ ఆర్టిసి)