యూరియా కొరత వైకాపా తప్పుడు ప్రచారం సృష్టి మాత్రమే
గతం కంటే అధికంగా రైతులకు అందుబాటులో నిల్వలు
కూటమి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలనే జగన్ కుట్రలు
న్యూస్ తెలుగు/వినుకొండ : రాష్ట్రంలో, వినుకొండ నియోజకవర్గంలో యూరియా కొరత కేవలం వైకాపా కుట్ర మాత్రమే అని మాజీ ఎమ్మెల్యే, జీడీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జున రావు మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం ఉన్న గతానికి మించిన రీతిలో యూరియా నిల్వలు రైతులకు అందుబాటులో ఉంచినా కేవలం కూటమి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలన్న ఏకైక లక్ష్యంతో విషప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే పట్టుకుని వినుకొండలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు మొసలికన్నీళ్లతో రాజకీయం చేస్తున్నారన్నారు. ఇకనైనా రైతులు వాస్తవాలు గమనించాలంటూ గణాంకాలతో సహా యూరియా వివరాలు వెల్లడించారు మక్కెన. మంగళవారం టిడిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ. బొల్లా, వైకాపా నేతల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తా రు. వైసీపీ పాలనలో 2022-23 ఖరీఫ్ సీజన్ లో పల్నాడు జిల్లాకు 1761 మెట్రిక్ టన్నులు అంటే 3,90,800 పైచిలుకు బస్తాలు, 2023-24లో 4,76,00 బస్తాలు మాత్రమే ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 2024-25లో 5.30 లక్షల బస్తాల యూరియా పంపిణీ చేశామని, 2025-26కి గాను ఇప్పటివరకు 6.73 లక్షల బస్తాలు పల్నాడు జిల్లాలో సరఫరా చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు మరో 75 వేల బస్తాల యూరియా రావడానికి సిద్ధంగా ఉందన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే వైకాపా వాళ్లు ధర్నాలు, రాస్తారోకోలు ఎందుకో అర్థం కావడం లేదు. మాజీ ఎమ్మెల్యే బొల్లా శావల్యాపురం మండలానికి 20 టన్నులే ఇచ్చారని మాట్లాడుతున్నారని, కానీ అక్కడికి ఇప్పటివరకు 272 టన్నులు అంటే 6 వేల బస్తాలు ఇవ్వడం జరిగిందన్నారు. బొల్లా స్వగ్రామం వేల్పూరుకు 2900 బస్తాలు ఇచ్చామన్నారు. ఆయన సొంతూరులో ఎన్ని బస్తాల యూరియా ఇచ్చారో తెలుసుకోకుండా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బొల్లా స్వగ్రామానికి 130 టన్నులు ఇచ్చామని, ప్రతి రైతు పేరు, ఫోన్ నెంబర్ నమోదై ఉందని, కావాలంటే ఎవరైనా వచ్చి పరిశీలన చేసుకోవచ్చని పేర్కొన్నారు. సొసైటీల ద్వారా పంపిణీ చేస్తున్నారని, ఎక్కడా అలజడులు లేవన్నారు. ఎక్కడా పైసా అవినీతికి, బ్లాక్ మార్కెట్‌కు ఆస్కా రం లేకుండా యూరియా పంపిణీ జరుగుతోందన్న మక్కెన వాళ్ల ఆరోపణలకు ఆధారాలు ఉంటే చూపాలని సవాల్ విసిరారు. తెల్లారిలేస్తే లోకేష్, పవన్, చంద్రబాబు, రెడ్‌బుక్ రాజ్యాంగం అన్న గావుకేకలు మాని వాస్తవంలోకి వస్తే వైకాపా వాళ్లకు కూడా అన్నీ అర్థమవుతాయని హితవు పలికారు. రైతుల సంక్షేమం, పథకాలు, రాయితీలపై వైకాపా అయిదేళ్లు, కూటమి 14 నెలల పాల నపై ఎప్పుడూ చర్చకు సిద్ధంగా ఉంటామన్నారు. తెల్లబర్లీ, నల్లబర్లీ, మిర్చి, మామిడి, కందులు, మొక్కజొన్నలు ఇలా అనేక పంటల్ని ప్రభుత్వమే మద్దతుధరలకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఇటీవల చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో ఆగస్ట్ నెలలోనే నాగార్జున సాగర్ డ్యామ్ నిండిందని, అందుకు తగినట్లే ప్రభుత్వం రైతులకు విత్తనాలు, ఎరువులు అన్నీ సకాలంలో అందుబాటులో ఉంచిందన్నారు. ఈ వాస్తవాల్ని కప్పిపుచ్చి, కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం, సూపర్‌సిక్స్ సూపర్‌హిట్ అయిన విషయం జీర్ణించు కోలేక కడుపుమంటతో వైకాపా చేస్తున్న తప్పుడు ప్రచారాల్ని ప్రతిఒక్కరు గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో శావల్యాపురం సొసైటీ చైర్మన్ గడిపూడి విశ్వనాథం,సొసైటీ చైర్మన్ పెసల వెంకటనారాయణ, బొల్లాపల్లి మండలం పార్టీ అధ్యక్షులు హనుమాన్ నాయక్, వినుకొండ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కాలింగ్ రాజు, గడిపూడి నరేంద్ర పాల్గొన్నారు.(Story :యూరియా కొరత వైకాపా తప్పుడు ప్రచారం సృష్టి మాత్రమే )

