పేద ప్రజల గొంతుక సిపిఐ: శ్రీరామ్
న్యూస్‌తెలుగు/ వనపర్తి : పేద ప్రజల గొంతుక సిపిఐ అని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కే శ్రీరామ్ అన్నారు. ఆదివారం గోపాల్పేటలో సిపిఐ నాలుగవ రాష్ట్ర మహాసభల గోడపత్రికలను వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్, కార్యవర్గ సభ్యుడు జే చంద్రయ్యతో కలిసి విడుదల చేశారు. మాట్లాడుతూ.. 1925, డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ లో ఆవిర్భవించిన సిపిఐ వందేళ్లుగా పేద ప్రజల హక్కుల కోసం పోరాడుతూ వస్తుందన్నారు. స్వాతంత్రం కోసం పిలుపునిచ్చిన తొలి పార్టీ సిపిఐ అన్నారు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 4500 మంది త్యాగాలు చేసిన చరిత్ర సిపిఐ కి ఉందన్నారు. భూమికోసం భుక్తి కోసం వెట్టి నుంచి ప్రజల విముక్తి కోసం పోరాడిందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిందన్నారు. పేదలకు భూముల పంపిణీ, రైతుకు గిట్టుబాటు ధర, నిరుద్యోగులకు ఉద్యోగం ఉపాధి, పేదలకు నిలువ నీడ కోసం ఇల్లు కల్పించాలని, దేశ సంపదలో ప్రజలకు వాటా దక్కాలన్నదే సిపిఐ లక్ష్యమన్నారు. అనేక సంక్షేమ పథకాలు సిపిఐ పోరాటం వల్లే ప్రజలకు లభించాయన్నారు. అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరూ ఎర్రజెండా పట్టాల్సిందే అన్నారు. బిజెపి ప్రజా వ్యతిరేక మతోన్మాద విధానాలు దేశ ఐక్యతకు ప్రమాదం అన్నారు. వ్యతిరేకంగా సిపిఐ పోరాడుతుందని ప్రజలు అందుకు సిద్ధం కావాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6గ్యారంటీలు అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం రాష్ట్ర మహాసభల్లో పలు తీర్మానాలు ఆమోదించటం జరుగుతుందన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారావు ఈనెల 20 నుంచి 22 వరకు రాష్ట్ర మహాసభలు జరుగుతాయని ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గోపాల్పేట మండల కార్యదర్శి మంగలి శాంతయ్య,గ్రామ కార్యదర్శి కురుమూర్తి, నాయకులు సుదర్శన్,బంగారి,రాజు, మొగిలి,అఖిల్,సాధిక్ తదితరులు పాల్గొన్నారు. (Story:పేద ప్రజల గొంతుక సిపిఐ: శ్రీరామ్)

