పద్యతిలక రాఘవేంద్రరావుకు మానాప్రగడ శేషశాయి పురస్కారం
న్యూస్‌తెలుగు/విజయనగరం : సాహితీ పర్జన్యుడు శేషశాయి చిలికించిన పద్యసుగంధం మధుర సుగంధ సాహితీ స్రవంతిగా మారి తీయని తేనెల పువ్వుల వర్షం కురిపించిందని ప్రముఖ సాహితీవేత్త సంగడి వీరరాఘవేంద్రరావు పేర్కొన్నారు. గురజాడ పాఠశాలలో తెలుగు భాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మధుర వచస్వి మానాప్రగడ శేషశాయి జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ విజయనగర సాహితీ లోకంలో వెలుగుపూలు పూయించిన సృజనామూర్తి శేషశాయి అని , నవరస మాధుర్య కవితా ప్రవాహం ఆయన స్వంతమని అన్నారు. ఈ సందర్భంగా 2025 సంవత్సరానికి గాను మానా ప్రగడ శేషశాయి పురస్కారాన్ని తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్, జనవిజ్ఞాన వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం వి ఆర్ కృష్ణాజీతో కలిసి రాజమండ్రికి చెందిన పద్యతిలక బిరుదాంకితులు రాఘవేంద్రరావుకు ప్రదానం చేసారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ జక్కు రామకృష్ణ, విజయనగరం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు జివి శ్రీనివాస్, మానాప్రగడ శ్రీనివాస సుధీమణి, ప్రసాదవర్మ , సంగడి శ్రీగణేష్ తదితరులు పాల్గొన్నారు. (Story:పద్యతిలక రాఘవేంద్రరావుకు మానాప్రగడ శేషశాయి పురస్కారం)

