ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటున్న కూటమి ప్రభుత్వం
రైతుల్ని మోసం చేసింది చాలక జగన్ రెడ్డి తప్పుడు ప్రచారం
వినుకొండలో అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకం ప్రారంభించిన గొట్టిపాటి, జీవీ
న్యూస్ తెలుగు/ వినుకొండ : కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతోందని, సూపర్‌సిక్స్ లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం అమలు ప్రారంభం అందుకు మరో నిదర్శనమని రాష్ట్ర విద్యుత్ విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. రైతుభరోసా పేరిట రైతులకు ఏటా 12,500 ఇస్తామని మోసం చేసి 7,500 ఇచ్చింది చాలక కూటమి ప్రభుత్వం పై లేనిపోని విమర్శలు చేయడం జగన్, వైకాపా దిగజారుడుతనమని మండిపడ్డారు. వినుకొండ మార్కెట్ యార్డులో అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకాన్ని పల్నాడు జిల్లా ఇన్ ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, చీఫ్‌విప్ జీవీ ప్రారంభించి రైతులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి గొట్టిపాటి సూపర్‌సిక్స్ హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు. ఈ ఏడాది పంటలు బాగా పండినా కొనుగోలుదారులు ముందుకు రాకపోతే ప్రభుత్వమే బాధ్యత తీసుకున్న విషయం గుర్తు చేసిన ఆయన రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందజేస్తున్నామన్నారు. మామిడి, పొగాకు రైతులను ప్రభుత్వమే ఆదుకుందని తెలిపారు . ఐనా ఏడాది తర్వాత జగన్ బయటకొచ్చి కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని, ప్రభుత్వం ఏం చేయలేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. నాడు ఇద్దరు పిల్లలకు డబ్బులు ఇస్తానని, ఒక్కరికే అమ్మఒడి అమలు చేశారని, రైతులకు రూ.12 వేలు పెట్టుబడి ఇస్తామని మాట తప్పిన వ్యక్తి జగన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. దొంగ పరామర్శల పేరుతో కార్యకర్తలను చంపిన వ్యక్తి జగన్ అన్న మంత్రిగొట్టిపాటి గత ప్రభుత్వంలో ప్రజాధనాన్ని దోచుకున్న ప్రతీ ఒక్కరికీ శిక్ష పడుతుందన్నారు. ఈ ప్రభుత్వంలో కక్షసాధింపు చర్యలు ఉండవని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. అనంతరం చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ 46.85లక్షల మందికి ఒకేసారి అన్నదాత సుఖీభవ అందించడం చరిత్రగా పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్రం సహకారానికి ధన్యవాదాలు తెలిపిన జీవీ జగన్ ప్రభుత్వంలో రూ.12,500 ఇస్తామని మోసం చేసి రూ.7,500 మాత్రమే ఇచ్చారన్నారు. కానీ సీఎం చంద్రబాబు అన్న మాట ప్రకారం రాష్ట్రం వాటా రూ. 14వేలు, కేంద్రం ఇచ్చే రూ. 6వేలు కలిపి రూ.20వేలు ఇస్తున్నారని అన్నారు. ఇదే జగన్ అయిదేళ్ల పాలనలో సంక్షేమ పథకాలకు కోతలు పెట్టారని. రైతులకు సూక్ష్మ పోషకాలు ఎగ్గొట్టారని, సబ్సిడీ యంత్ర పరికరాలు అందించలేదని మండిపడ్డారు. ధాన్యం రైతు లకు రూ. 1674 కోట్లు బకాయి పెడితే తాము కట్టామని , పంటలబీమానూ చెల్లిస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని ఉద్యానపంటల హబ్‌గా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రమిస్తోందన్న జీవీ అందులో భాగంగానే 90%రాయితీలో బిందుసేద్యం సామాగ్రి, సోలార్ పంపుసెట్లు కూడా ఇస్తున్నట్లు తెలిపారు. వినుకొండ, పల్నాడు జిల్లాను ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దుతామని. రైతులతలసరి ఆదాయంలో జిల్లాను అగ్రస్థానంలో నిలబెడతామని అన్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో గతేడాది కన్నా ఈ సంవత్సరం ముందుగానే సాగర్ జలాలు విడుదల చేశామన్నారు. రైతులు కూడా ఈ ఏడాది ముందుగానే వ్యవసాయం మొదలు పెట్టారన్నారు. విత్తనాలు, ఎరువులు రైతు భరోసా కేంద్రాల ద్వారా సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాయని, డిమాండ్ కు తగ్గట్లుగా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచామన్నారు. ఎరువులకు రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న కలెక్టర్ వ్యవసాయ పనులు ప్రారంభానికి ముందే అన్నీ సరఫరా చేస్తున్నామన్నారు. అన్నదాత సుఖీభవ పథకం అందని రైతుల ఈ-కేవైసీ,కౌలు రైతుల అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిడిసిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి షకీలా, కూటమి నేతలు మేడం రమేష్, పెమ్మసాని నాగేశ్వరరావు, షమీం, నిశంకర శ్రీనివాసరావు, కే. నాగ శ్రీను, శావల్యాపురం సొసైటీ అధ్యక్షులు గడిపూడి విశ్వనాథం, వినుకొండ యార్డ్ చైర్మన్ మురళీ కృష్ణ యాదవ్, జెడిఎ ఎం.జగ్గారావు, ఏడిఏ. సి.హెచ్. రవికుమార్, ఎ. ఓ వరలక్ష్మి , తాసిల్దార్ సురేష్ నాయక్, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, సొసైటీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారులకు 45,773 రైతులకు రూ. 32.4 కోట్లు విడుదలైనట్లు అధికారులు తెలిపారు. (Story:ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటున్న కూటమి ప్రభుత్వం)
