వనపర్తి ప్రభుత్వ ఐటీఐ/అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్‌లో రెండో విడత అడ్మిషన్లు
న్యూస్‌తెలుగు/వనపర్తి : ప్రభుత్వ ఐ.టి.ఐ కళాశాలలో ప్రస్తుతం బాగా డిమాండ్ ఉన్న వృత్తి విద్యా కోర్సుల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు అడ్మిషన్లు జరుగుతున్నాయని ఆసక్తి గల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి విజ్ఞప్తి చేశారు. మంగళవారం కలెక్టర్ తన చాంబర్లో ప్రభుత్వ ఐటిఐ, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ కు సంబంధించిన వాల్ పోస్టర్ను సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ (ఏటీసీ) నెలకొల్పి వాటిలో ప్రస్తుతం బాగా డిమాండు ఉన్న కోర్సులను ప్రవేశపెట్టిందన్నారు. ఈ ఆధునిక వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు గాను రెండో విడత అడ్మిషన్లు ప్రారంభం అయినట్లు చెప్పారు.
నైపుణ్యవంతమైన వృత్తి విద్యతో పాటు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ టాటా సంస్థతో కలిసి అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి (6) కోర్సులను ప్రవేశ పెట్టిందన్నారు. వనపర్తి జిల్లాలో 1. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ (40 సీట్లు), 2. మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్(24 సీట్లు), 3. బేసిక్ డిజైనర్ మరియు వర్చువల్ వెరిఫైయర్ మెకానికల్ (24 సీట్లు) 4. ఆర్టిసన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్ (20 సీట్లు) 5. అడ్వాన్స్డ్ సిఎంసి మిషన్ టెక్నీషియన్ (24 సీట్లు) 6. ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్(40 సీట్లు) ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్ లో బాగా డిమాండ్ ఉన్న కోర్సులను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు.
పై కోర్సులతోపాటు రెగ్యులర్ కోర్సులు ఎలక్ట్రిషన్, ఫిట్టర్, డ్రాట్స్ మాన్, సీఓపిఏ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులని, కోర్సును బట్టి ఒకటి లేదా రెండు సంవత్సరాల కోర్సులు ఉన్నట్లు తెలిపారు. కోర్సు పూర్తి అయిన వెంటనే ఉపాధి, ఉద్యోగ కల్పన కు ఈ ఆధునిక కోర్సులు ఎంతగానో ఉపయోగపడతాయని వీటిని జులై 31 లోగా భర్తీ చేసేందుకు గడువు ఉన్నట్టు తెలిపారు.
మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ http://iti.telangana.gov.in ను సందర్శించగలరు లేదా క 9490202037, 9849244030, 7995335372 కాల్ చేయవచ్చని సూచించారు. ప్రభుత్వ ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్ రమేష్, టీ గెట్ చంద్రశేఖర్ గౌడ్, ఏ ఎల్ వో వేణుగోపాల్, ఇతర సిబ్బంది తదితరులు ఉన్నారు. (Story:వనపర్తి ప్రభుత్వ ఐటీఐ/అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్‌లో రెండో విడత అడ్మిషన్లు )

