ఒడిశా లో గిరిజన వింత సంప్రదాయం
వరుస కాని వారు ప్రేమిస్తే తప్పే
న్యూస్ తెలుగు/ చింతూరు : సంబంధీకుడిని ప్రేమించడం వల్ల పెద్ద మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ప్రేమజంటను గ్రామస్థులు పశువుల్లా జువ్వళ్లు వేసి ఊరేగించారు. మూడు రోజుల వ్యవధిలో రెండు అమానవీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి.మొదటి ఘటన రాయగడ జిల్లాలోని కంజాం గూడాలో జరిగితే, రెండోది నేడు కొరాపుట్ జిల్లా నారాయణపట్నా సమీపంలోని దుర్గమ పహాడీ ప్రాంతం బొరిగి పంచాయతీ పరిధిలోని పెదాఇతికి గ్రామంలో జరిగింది.పెదాఇతికి గ్రామానికి చెందిన పీడికా తరగతికి చెందిన యువతితో అదే తరగతికి చెందిన యువకుడు ప్రేమసంబంధం పెట్టుకున్నాడు. రథయాత్ర సందర్భంగా ఇద్దరూ కలిసి గ్రామం వదిలి పారిపోయారు. అయితే గ్రామస్తుల అభిప్రాయం ప్రకారం, ఇద్దరూ బంధుత్వంగా (అన్నా-చెల్లెలుగా) ఉండడంతో, వారి చర్యను తప్పుగా పరిగణించారు.ఆ తర్వాత గ్రామ పెద్దలు ఇద్దరినీ పిలిపించి, గ్రామ మధ్యలో ఉన్న దేవీపథర దగ్గర వారిద్దరికి జువ్వళ్లు వేసి ఊరేగించారు. అనంతరం మామిడి ఆకులతో నీళ్లు పోసి పకై(పవిత్రత) కార్యక్రమం నిర్వహించి వారిని తప్పు చేసినవారిగా శిక్షించారు.
ఈ సంప్రదాయాన్ని కొన్ని వర్గాలు మానవ హక్కుల ఉల్లంఘనగా విమర్శిస్తుండగా, గ్రామస్తులు మాత్రం “ఇది మా సంప్రదాయం” అని అశ్రద్ధగా సమాధానం ఇచ్చారు. అంతేగాక, ఇలా చేయకపోతే వర్షాభావం ఏర్పడి పంటలు నష్టపోతాయని వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే, నారాయణపట్నా పోలీసులు పెదాఇతికి గ్రామానికి చేరుకుని, సంఘటనపై విచారణ ప్రారంభించారు.ఈ నేపథ్యంలో, గ్రామాలలో విస్తృత స్థాయిలో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉంది. (Story : ఒడిశా లో గిరిజన వింత సంప్రదాయం)

