అహ్మాదాబాద్ విమాన ప్రమాదంలో
242 మంది మృతి
అహ్మాదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇవాళ జరిగిన విమాన ప్రమాదంలో 242 మంది మరణించారు. విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాల్లోనే ఆ విమానం కూలింది. ప్రమాదం నుంచి ఎవరూ బ్రతికినట్లు లేరని అహ్మదాబాద్ పోలీసు కమీషనర్ జీఎస్ మాలిక్ తెలిపారు. అంతర్జాతీయ మీడియా సంస్థ ద అసోసియేటెడ్ ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. రెసిడెన్షియల్ ప్రాంతంలో విమానం కూలడం వల్ల అదనంగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు ఆయన చెప్పారు. అయితే బోయింగ్ డ్రీమ్‌లైనర్ ప్రమాదం వల్ల మొత్తం ఎంత మంది చనిపోయారన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని, దానిపై త్వరలో ప్రకటన చేస్తామన్నారు. ప్రమాద సమయంలో విమానంలో 232 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది ఉన్నారు. విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటీష్ జాతీయులు, ఏడు మంది పోర్చుగీస్, ఓ కెనడా దేశస్థుడు ఉన్నారు. అహ్మదాబాద్‌లోని మేఘనీనగర్ ఏరియాలో ఉన్న దార్‌పుర్‌లో విమానం కూలింది. ఎమర్జెన్సీ బృందాలు ఆ ప్రాంతానికి హుటాహుటిన చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. ఏ కారణం చేత ప్రమాదం జరిగిందో అధికారులు ఇంకా నిర్ధారించలేదు. ఆ విమానంలో ప్రయాణిస్తున్న మాజీ సీఎం విజయ్ రూపానీ మృతిచెందినట్లు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. (Story:అహ్మాదాబాద్ విమాన ప్రమాదంలో 242 మంది మృతి)