ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
న్యూస్ తెలుగు/వనపర్తి : ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, పిడి డిఆర్డిఓ ఉమాదేవితో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ముఖ్యమంత్రి ప్రజావాణి, జిల్లా మంత్రి ద్వారా ఈ జిల్లాకు వచ్చే ఫిర్యాదులు, జిల్లా ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈరోజు ప్రజావాణికి మొత్తం 55 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు.
కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.(Story : ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి )

