వేసవిలో వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు పాటించాలి
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
న్యూస్ తెలుగు/వనపర్తి :వేసవిలో భానుడి ప్రతాపం రోజు రోజుకి తీవ్రరూపం దాల్చి ప్రజలను అనారోగ్యానికి గురయ్యేలా చేస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి నేడొక ప్రకటనలో తెలిపారు.వేసవికాలం ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య వడదెబ్బ. అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత కారణంగా బయట పనికి వెళ్లే వాళ్లే కాకుండ ఇంట్లో ఉండే వృద్ధులు, పిల్లలు సైతం వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంటుందని సూచించారు. ఈ సందర్భంగా కొన్ని జాగ్రత్తలు పాటించి వడదెబ్బ తగలకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. ఉదయం నుండి 12 గంటల లోపే బయటి పనులు పూర్తి చేసుకోవాలని, అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లకపోవడం మంచిదని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వెళ్లవలసివస్తే నెత్తికి టోపి లేదా గొడుగు వెంట తీసుకువెళ్లాలి. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవడం ముఖ్యం. వడదెబ్బకు గురైనప్పుడు సరైన చర్యలు తీసుకోకపోతే ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది.వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా చల్లటి నీరు, ఓఆర్ఎస్ ద్రావణం, పండ్ల రసాలు తీసుకోవడం, తేలికైన దుస్తులు ధరించడం చాలా ముఖ్యం. వడదెబ్బ లక్షణాలు (తలనొప్పి, వాంతులు, మైకము, అధిక జ్వరం, తల తిరగడం, స్పృహ కోల్పోవడం) కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.పిల్లలు వృద్ధులు ఎండలో ఎక్కువసేపు ఉండకూడదు. వీలైనంతవరకు ఇంట్లోనే ఉండటం మంచిదని సూచించారు.(Story : వేసవిలో వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు పాటించాలి )