ప్రజా పంపిణీ వ్యవస్థపై నిఘా ఉంచాలి
న్యూస్ తెలుగు / వినుకొండ : ప్రభుత్వ చౌక దుకాణాలు, వంట గ్యాస్ సరఫరా పై నిఘా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని వినుకొండ తహసీల్దార్ సురేష్ నాయక్ కోరారు. శుక్రవారం స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ అధ్యక్షతన విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఎండియూ ఆపరేటర్లు, మండల విద్యాశాఖ అధికారి సయ్యద్ జఫ్రూలా, సిడిపిఓ అనురాధ, డిటి. మురళి, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. తాసిల్దార్ మాట్లాడుతూ. రేషన్ బియ్యం సరుకులు, వంట గ్యాస్ ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా సరఫరా జరగాలని, దీనిపై పై విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ అధికారులకు సహకరించి సరఫరా పై నిఘా ఉంచాలని సూచించారు. వినుకొండ మండలంలో 59 చౌక దుకాణాలు ఉండగా వినుకొండ టౌన్ లో 26 దుకాణాలు, రూరల్ లో 23 దుకాణాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. మొత్తం 452 మెట్రిక్ టన్నుల బియ్యం, పంచదార తదితర సరుకులు వస్తున్నాయి అన్నారు. టౌన్ లో తొమ్మిది వాహనాలు, రూరల్ లో 20 వాహనాల ద్వారా బియ్యం సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎంఈఓ జఫ్రుల్లా మాట్లాడుతూ. వినుకొండ మండలంలో 76 స్కూల్స్ విద్యార్థులకు భోజన వసతి కల్పిస్తున్నట్లు, రూరల్లో 59 స్కూల్స్ టౌన్ లో 17 స్కూల్స్కు భోజన వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే వినుకొండ మండలంలో 234 అంగన్వాడి కేంద్రాలు ఉండగా రూరల్ లో 186, టౌన్ లో 48 అంగన్వాడి కేంద్రాలకు పౌష్టిక ఆహారాలు సరఫరా చేస్తున్నామని సిడిపిఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. (Story : ప్రజా పంపిణీ వ్యవస్థపై నిఘా ఉంచాలి)