27న క్యాన్సర్ కు ఆయుర్వేద వైద్య చికిత్స పై సదస్సు
బ్రోచర్ ఆవిష్కరించిన మంత్రి సత్య కుమార్ యాదవ్
న్యూస్ తెలుగు/అనంతపురం : ఈనెల 27వ తేదీన అనంతపురం జిల్లా కేంద్రం లోని రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న శ్రేయాస్ గ్రాండ్ లో క్యాన్సర్ కు ఆయుర్వేద వైద్య చికిత్స అనే అంశంపై మెగా సదస్సు నిర్వహిస్తున్నట్లు సదరన్ స్టేట్స్ కోఆర్డినేటర్ డాక్టర్ వీరబోయిన నాగేశ్వరరావు, అధ్యక్షులు డాక్టర్ బండారు నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోగుల కుమారయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ నల్లపాటి తిరుపతి నాయుడు తెలిపారు. మంగళవారం అనంతపురం రాంనగర్ లో మంత్రి సత్య కుమార్ యాదవ్ ఈ సదస్సుకు సంబంధించిన బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఆయుష్ వైద్య విధానానికి అధిక ప్రాధాన్యతనిస్తూ.. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయుష్ వైద్యుల నియామకాలను ఏపీపీఎస్సీ ద్వారా కాకుండా అల్లోపతి వైద్యుల నియామకం క్రమంలోనే కొనసాగించేలా పరిశీలిస్తున్నామని.. తద్వారా ఖాళీగా ఉన్న నియామకాలను సత్వరమే భర్తీ చేయొచ్చని మంత్రి తనకు ఇచ్చిన వినతి పత్రానికి సమాధానంగా చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా విభాగ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం శాంతి ప్రియ, రాష్ట్ర నాయకులు డాక్టర్ మాలిక్, అనంతపురం జిల్లా అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ నాయక్, కర్ణాటక రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ పి నాగేంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు.(Story : 27న క్యాన్సర్ కు ఆయుర్వేద వైద్య చికిత్స పై సదస్సు )