రాజీవ్ యువ వికాసం పథకానికి ఎంపీడీవో కార్యాలయంలో కౌంటర్ ఏర్పాటు చేయాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన వారి నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించేందుకు ఎంపీడీవో కార్యాలయంలో కౌంటర్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం పెబ్బేరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ఎంపికైన లబ్ధిదారులు వేగంగా గ్రౌండ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన వారి నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించేందుకు ఎంపీడీవో కార్యాలయంలో కౌంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఉన్న ఇందిరమ్మ నమూనా గృహాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ నెలాఖరులోపు నిర్మాణాన్ని పనులను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ విభాగం డి ఈ విఠోబాకు సూచించారు. ఇకనుంచి ప్రతి నెల నాణ్యమైన సన్న బియ్యం
పేదలకు నాణ్యమైన సన్న బియ్యం అందించాలనే ఉద్దేశంతోనే, ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.
పెబ్బేరు మండల కేంద్రంలోని మూడవ నెంబర్ రేషన్ దుకాణాన్ని సందర్శించి, రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం రేషన్ దుకాణంలో ఉన్న స్టాక్ రిజిస్టర్, బియ్యం పంపిణీ చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. బియ్యం తీసుకోవడానికి వచ్చిన స్థానికులతో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సన్న బియ్యంను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇకనుంచి ప్రతి నెల తెల్ల రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. తహసిల్దార్ లక్ష్మి, ఎంపీడీవో రవీంద్ర, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు. (Story : రాజీవ్ యువ వికాసం పథకానికి ఎంపీడీవో కార్యాలయంలో కౌంటర్ ఏర్పాటు చేయాలి)