ఉచితంగా సన్న రకం బియ్యం సరఫరా
న్యూస్‌తెలుగు/వనపర్తి : ఏప్రిల్ 2 నుండి వనపర్తి జిల్లాలో తెల్ల రేషన్ కార్డుల వారికి చౌక ధర దుకాణాల నుండి ఉచితంగా సన్న రకం బియ్యం సరఫరా చేయనున్నట్లు అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు నేడు ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం జిల్లాలోని ఆయా నియోజకర్గాల్లో స్థానిక శాసన సభ్యులు చౌక ధర దుకాణాల్లో సన్న రకం బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు.
జిల్లా వ్యాప్తంగా 1,59,353 తెల్ల రేషన్ కార్డులు ఉండగా 5,22,367 మంది కుటుంబ సభ్యులు ఉన్నట్లు గణాంకాలు వెల్లడించారు. రేషన్ కార్డులోని ఒక్కో కుటుంబ సభ్యునికి నెలకు 6 కిలోల చొప్పున సన్న రకం బియ్యం ఉచితంగా ఇవ్వనున్నారు. దీనికోసం జిల్లాలో 3309 మెట్రిక్ టన్నుల సన్న రకం బియ్యం అవసరం ఉంటుంది. బుధవారం నుండి జిల్లాలోని మొత్తం 324 చౌక ధర దుకాణాల్లో సన్న బియ్యం ఉచిత పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. జిల్లాలో సన్న రకం బియ్యం పంపిణీ చేయుటకు అవసరమైన ధాన్యం నిల్వలు ఉన్నట్లు అదనపు కలెక్టర్ వివరించారు.
జిల్లాలోని తెల్ల రేషన్ కార్డు కుటుంబాలు ప్రభుత్వం ద్వారా ఇస్తున్న ఉచిత సన్న రకం బియ్యాన్ని తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. (Story : ఉచితంగా సన్న రకం బియ్యం సరఫరా)