పీ-4 విధానంతో రాష్ట్రంలోని కడుపేదలందరి అభివృద్ధి
పేదరిక, ఆర్థిక అసమానతల నివారణే సీఎం చంద్రబాబు లక్ష్యం
వరసగా 3నెలలు పింఛను తీసుకోకపోయినా ఒకేసారి ఇస్తాం
వినుకొండలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన జీవీ ఆంజనేయులు
న్యూస్ తెలుగు / వినుకొండ : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ ఆశయాల్లో ఒకటైన పేదరికం, ఆర్థిక అసమానతల నివారణే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. అదే లక్ష్యంతో ఉగాది రోజున ఆయన ప్రారంభించిన పీ-4 విధానంతో రాష్ట్రంలోని కడుపేదలు అందరి అభివృద్ధి స్వప్నం సాకారం కాబోతోందన్నారు. రానున్న పదేళ్లలో అది నెరవేరుతుందని, ఆ దిశగా తనవంతు సహాయ సహకారాలు అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు. స్థానిక 28వ వార్డు పరిధిలోని ఓబయ్య కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో కలిసి మంగళవారం పంపిణీ చేశారు. పింఛన్ల పంపిణీలో లబ్ధిదారుల ముఖాల్లో సంతోషం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. లబ్ధిదారుల ప్రయోజనా లు దృష్టిలో ఉంచుకొని ఎవరైనా పలు కారణాలతో వరుసగా 3 నెలలు పింఛన్ తీసుకోకపోయినా వాటిని ఒకేసారి అందిస్తున్నామని చెప్పారు. ప్రతి నెల 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచి 65 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. వృద్ధులు, వితంతువులకు రూ. 4,000, విభిన్న ప్రతిభావంతులకు రూ. 6,000 పింఛన్ అందిస్తూ పోషకాహారం, మెరుగైన జీవనం కోసం కృషి చేస్తున్నామన్నారు. కుటుంబంలో పింఛను వచ్చే ఒక్కరు చనిపోతే తర్వాత అర్హులైన వారికి కొత్త పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. సమాజంలో 10% ధనవంతులు, 20% కడు నిరుపేదల కు సాయం చేసేలా ఉగాది రోజున చంద్రబాబు పీ-4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ధనవంతుల సాయంతో పేదలను పైకి తీసుకొచ్చే ఈ పథకం ద్వారా పేదరికం లేని సమాజం, ఆకలి బాధలు లేని రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్నది లక్ష్యమన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చి, తలసరి ఆదాయం రూ. 54 లక్షలకు చేర్చే ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ లక్ష్యంలో భాగంగా వినుకొండలో లెదర్ పార్క్ వంటి పరిశ్రమలు ఏర్పాటు చేస్తే వ్యక్తిగతంగా తాను కూడా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నా అని.. ఆ విషయమై సీఎం చంద్రబాబు, లోకేష్‌లను కలిసి విజ్ఞప్తి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, మున్సిపల్ ఛైర్మన్ దస్తగిరి , కూటమి నాయకులు కే. నాగశ్రీను, పి.వి.సురేష్ బాబు, పి. అయూబ్ ఖాన్ , సౌదగర్ జాని భాషా, కార్యకర్తలు పాల్గొన్నారు.(Story : పీ-4 విధానంతో రాష్ట్రంలోని కడుపేదలందరి అభివృద్ధి)